‘ప్రైవేట్‌’కు పంపొద్దని తీర్మానం | - | Sakshi
Sakshi News home page

‘ప్రైవేట్‌’కు పంపొద్దని తీర్మానం

Jun 15 2026 4:10 AM | Updated on Jun 15 2026 4:10 AM

ఏటూరునాగారం: మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో చిన్నబోయినపల్లి గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయదారుల కుటుంబాలు ఉంటాయి. వారి పిల్లలను ఏటూరునాగారం, కమలాపురం, ఇతర ప్రైవేట్‌ పాఠశాలలకు పంపేవారు. అయితే ప్రభుత్వ బడి ఉన్న తర్వాత ప్రైవేట్‌ పాఠశాలల కు ఎందుకు పంపాలని గ్రామ సర్పంచ్‌ నల్లబోయిన నాగార్జున, హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న స్థానిక గ్రామస్తులు దూపటి సతీశ్‌లు కలిసి గ్రామాన్ని ఏకం చేశారు. ఇక నుంచి గ్రామంలోని చిన్నారులను ప్రైవేట్‌ పాఠశాలలకు పంపొద్దని గ్రామసభలో ప్రజలంతా గతనెల 31న తీర్మానం చేశారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి, ఎల్‌కేజీ, యూకేజీ సైతం చిన్నబోయినపల్లి డీఎన్‌టీ ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని తీర్మానించారు. ఇదే కాకుండా చుట్టుపక్కల గ్రామాలైన గోగుపల్లి, శివాపురం, పెద్ద వెంకటాపురం, షాపెల్లి, హనుమాన్‌ నగర్‌ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈ పాఠశాలకు రావడానికి ప్రత్యేకంగా ఆటోలను ఏర్పాటు చేసి బడికి రావడం, తిరిగి ఇంటికి తీసుకెళ్లడం వంటి ఏర్పాట్లు కూడా చేశారు. డీఎన్‌టీ పాఠశాలలో ఆదర్శ గ్రంథాలయాన్ని కానిస్టేబుల్‌ సతీశ్‌, మరికొంత మంది యువకులు కలిసి సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. ఈ విషయం కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావుకు తెలిసి ఇటీవల సర్పంచ్‌ నాగార్జున, సతీశ్‌ను జిల్లా కేంద్రంలో సైతం సన్మానించారు. ఆ గ్రంథాలయం ఏర్పాటు విషయాన్ని కలెక్టర్‌కు వివరించగా ఆసక్తికనబర్చిన వెంటనే చిన్నబోయినపల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రంథాలయంలో ఉన్న 2 వేల పోటీ పరీక్షల పుస్తకాలను పరిశీలించి ఆశ్చర్యపోయారు. వెంటనే జిల్లాలోని ఎంఈఓలు సైతం ఇలాంటి ఆదర్శ గ్రంథాలయాలను ప్రతీ పాఠశాలలో ఏర్పాటు చేయాలని అక్కడి నుంచే ఆదేశాలను జారీ చేశారు. అంతేకాకుండా పాఠశాల హెచ్‌ఎం కవితతో పాటు మరో ఏడుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులను ఈ పాఠశాలకు కేటాయించడం విశేషం.

ఒకే రోజు 138 మందికి అడ్మిషన్లు

చిన్నబోయినపల్లి చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రీ ప్రైమరీ స్కూల్‌కు వేరే గ్రామాలకు వెళ్లకుండా కలెక్టర్‌, ప్రభుత్వంతో మాట్లాడి అదే గ్రామంలోనే ప్రీప్రైమరీ స్కూల్‌ను గ్రామస్తులు మంజూరు చేయించుకున్నారు. ఈ క్రమంలో 138 మంది విద్యార్థులు మే 31న ఒకే రోజు పాఠశాలలో నూతనంగా అడ్మిషన్లను పొందారు. ఇలా వారం తరబడి అడ్మిషన్ల కోసం తిరిగిన ఉపాధ్యాయులకు సాధ్యం కానిది.. ఒకే రోజు గ్రామస్తులంతా కలిసి చేశారు. ఒకేరోజు 138 మంది డీఎన్‌టీ ప్రభుత్వ పాఠశాలలో ఆడ్మిషన్లు పొందడంతో రాష్ట్రంలో మొదటి సారి కావడం గమనార్హం. అంతేకాకుండా ఆ విద్యార్థులకు స్థానిక సర్పంచ్‌ నాగార్జున సొంత ఖర్చుతో బ్యాగులు, స్టడీ మెటీరియల్‌ను అందజేశారు.

గ్రామసభలో ప్రభుత్వ పాఠశాలకే

పెద్దపీట

రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచిన

చిన్నబోయిపల్లి పాఠశాల

జిల్లా వ్యాప్తంగా ఆదర్శ గ్రంథాలయ ఏర్పాటుకు కలెక్టర్‌ సూచనలు

ఒకే రోజు 138 అడ్మిషన్లు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement