● సైక్లింగ్ అసోసియేషన్
జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్
ములుగు: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అన్నారు. జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ క్రీడా మంత్రిత్వశాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆదివారం నిర్వహించిన అస్మితబాలికల సైక్లింగ్ పోటీలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన యువతులు, విద్యార్థినులు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో సీనియర్ కేటగిరి విభాగంలో సంగీత, జూనియర్ విభాగంలో అలువాల సుమనశ్రీ ప్రతిభ కనబర్చి విజేతలుగా నిలిచారు. కాగా వారికి అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ మెమోంటోలు అందజేయడంతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బాదం ప్రవీణ్ మాట్లాడుతూ యువత క్రీడలపై ఆసక్తి చూపాలన్నారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. సైక్లింగ్ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మరింత మంది క్రీడాకారులు ముందుకొచ్చి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటాలన్నారు. అనంతరం కోచ్ హుస్సేన్‌ను బాదం ప్రవీణ్‌ను అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పోరిక అసిలాల్, కోచ్ శ్రీరామ్, క్రీడాకారులు, 108 సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


