ములుగు రూరల్: రైతులు తొలకరి వర్షాలకు తొందరపడి పత్తి విత్తనాలు విత్తుకోవద్దు. నేల పూర్తి స్థాయిలో తడిసిన తర్వాత మాత్రమే పత్తి విత్తనాలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సురేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో పంటల సాగులో యాజమాన్య పద్ధతులు, విత్తన ఎంపిక, ఎరువుల వినియోగం వంటి సందేహాలను నివృత్తి చేశారు. రైతులు ప్రతీ సంత్సరం ఒకే పంటను సాగు చేయకుండా పంట మార్పిడి చేసుకోవాలన్నారు. నత్రజని ఎరువుల వినియోగం తగ్గించాలని సూచించారు. పంటల సాగు విషయం, విత్తన ఎంపికలో రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పలువురు రైతులు అడిగిన ప్రశ్నలకు జిల్లా వ్యవసాయ అధికారి సురేష్‌కుమార్ సమాధానం ఇచ్చారు.
ప్రశ్న: కొన్ని రకాల సన్నాలకు మాత్రమే ప్రభుత్వం బోనస్ ఇస్తుందని ప్రచారం జరుగుతుంది. వాటికి మాత్రమే ఇస్తారా?
– ఇమ్మడి భిక్షపతి, రైతు, ములుగు
జవాబు: రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది రకాల సన్నాలు సాగు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని ఆదేశించింది. అంతేకాని వాటికి మాత్రమే బోనస్ అనేది లేదు. గతంలో ఎంపిక చేసిన 32 రకాలకు బోనస్ వస్తుంది. ప్రజలు తినడానికి, మిల్లర్ల అనుకూలత, దిగుబడి ఉంటుందని ప్రమోషన్ చేశాం.
ప్రశ్న: నాకు ఉన్న ఆరు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. ఏటా దిగుబడి తగ్గుతుంది?
– బొంతల రాజు, రైతు ములుగు
జవాబు: ప్రతీ ఏటా ఒకే రకమైన పంట సాగు చేయడంతో దిగుబడి తగ్గుతుంది. కాబట్టి పంట మార్పిడి చేయాలి. దీంతో పాటు భూమి సారవంతం పెంచడానికి పశువుల ఎరువు గాని పచ్చిరొట్ట సాగు చేయడం చేయాలి. భూసారం పెరిగిన దిగుబడి పెరుగుతుంది.
ప్రశ్న: భూమిలో ఎక్కువ రోజులు నీటి నిల్వలు ఉంటున్నాయి. ఎలాంటి పంట సాగు చేయాలి?
– రమేష్, రొయ్యూరు
జవాబు: భూమిలో ఎక్కువ రోజులు నీటి నిల్వ ఉండే భూముల్లో ఐఆర్ 64 రకం లేదా తెల్లహంసలు సాగు చేసుకుంటే మేలు. ఈ రకాలు సుమారు 40 రోజులు నీరు నిలిచి ఉన్నప్పటికీ ఇబ్బంది ఉండదు.
ప్రశ్న: మిర్చి సాగులో నల్లి తెగులు నివారణకు సూచనలు ఇవ్వండి.
– శ్రీనివాస్, రొయ్యూరు
జవాబు: మిర్చి సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి. పంటలో ఎల్లో స్టికిస్, బ్లూ స్టిక్కిస్, లైట్ ట్రాప్స్ పెట్టుకోవాలి. రైతులకు సమ్మక్క–సారక్క ఎన్‌జీఓ ద్వారా ఉచితంగా ఇప్పిస్తాం. పురుగు మందులతో నల్లి తెగులు నివారణ కష్టం.
ప్రశ్న: పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయా?
– అల్లం చంటి, ఏటూరునాగారం
జవాబు: పచ్చిరొట్ట విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. మీకు అందుబాటులో ఏటూరునాగారం పీఏసీఎస్‌లో ఉన్నాయి. 50శాతం సబ్సిడీతో రైతులకు అందిస్తున్నారు. 40 కేజీల బ్యాగు సుమారు మూడు ఎకరాల్లో సాగు చేసుకోవాలి.
ప్రశ్న: వరి సాగులో ఏ విత్తనాలు మేలు?
–కొనుపుల కుమార్, ములుగు
జవాబు: వరి సాగులో స్వల్ప, మధ్య రకం విత్తనాలను సాగు చేసుకోవడం మేలు. ఈ ఏడాది వర్షాభావం తక్కువగా ఉండే పరిస్థితి ఉంది. ధీర్ఘకాలిక విత్తనాల సాగుతో నీటి వినియోగానికి ఇబ్బందులు ఎదురుకావచ్చు. స్వల్ప, మధ్యకాలిక విత్తనాలు సాగు చేసుకుంటే మంచిది.
ప్రశ్న: వర్షాదారంతో సాగుకు అనుకూలంగా ఉండే వరి విత్తనాలను వివరించండి?
– సత్యనారాయణ, వెంకటాపురం(కె)
జవాబు: వర్షాదారంపై ఆధారపడి సాగు చేసే రైతులు స్వల్పకాలిక విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. ఆర్‌ఎన్‌ఆర్, కేఎన్‌ఎం, 1010 రకాలు సాగు చేసుకోవాలి. వాటి కాలపరిమితి 120 రోజుల నుంచి 130 రోజుల్లో పంట చేతికి వస్తుంది.
పూర్తిస్థాయిలో వర్షాలు కురిసిన తర్వాతే పత్తి విత్తుకోవాలి
వరి సాగులో స్వల్ప, మధ్యకాలిక రకాలు మేలు
అందుబాటులో పచ్చిరొట్ట విత్తనాలు
యూరియా వాడకం తగ్గించాలి
‘సాక్షి’ ఫోన్‌ఇన్‌లో జిల్లా వ్యవసాయ అధికారి సురేష్‌కుమార్


