మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హే మాచల లక్ష్మీనర్సింహాస్వామిని ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) పింగళి శ్రీపాల్‌రెడ్డి శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, పూజారులు అనిపెద్ది రాజీవ్‌శర్మ సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న ఆయన గోత్ర నామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి ప్రత్యేకతలు, ఆలయ చరితర వివరించి స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి వేద ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలను అందించారు.
పిల్లలతో పనులు
చేయిస్తే చర్యలు
ములుగు రూరల్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని, పిల్లలతో పనులు చేయిస్తే చర్యలు తప్పవని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిలర్ మేకల మహేందర్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలతో పనిచేయించడం నేరమన్నారు. అనంతరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ అధికారి ఓంకార్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిలర్ బానోత్ స్వామిదాస్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది సంజీవ, ఎల్‌సీపీఓ కౌన్సిలర్ సంధ్య, సోషల్ వర్కర్ సుమన్ తదితరులు ఉన్నారు.
కాళేశ్వరాలయం హుండీ ఆదాయం రూ.48.25 లక్షలు
కాళేశ్వరం: శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీలను విప్పి నగదు లెక్కించగా రూ.48,25,170 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్.మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పర్యవేక్షణాధికారిగా ఇన్‌స్పెక్టర్ ఎం.అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు గ్రంధసిరి సత్యనారాయణ, సీతయ్య, ప్రశాంత్‌రెడ్డి, శ్రీధర్‌రావు, పద్మ, శ్యామసుందర్, కాటం సత్తయ్య, దుర్గయ్య పాల్గొన్నారు.
20న జాతీయ లోక్‌అదాలత్
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో పెద్దఎత్తున కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌వీపీ సూర్యచంద్రకళ సూచించారు. శుక్రవారం పోలీసు అధికారులు, న్యాయవాదులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి లోక్ అదాలత్ విజయవంతానికి అవసరమైన చర్యలపై చర్చించారు. కేసుల పరిష్కారంలో రాజీమార్గాన్ని ప్రోత్సహించాలన్నారు. ఇరుపక్షాలు స్నేహపూర్వక వాతావరణంలో వివాదాలను పరిష్కరించుకుంటే సమయం, ధనం ఆదా కావడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ముఖ్యంగా సివిల్ కేసుల్లో రాజీద్వారా పరిష్కారం పొందిన వారికి చెల్లించిన కోర్టు ఫీజును తిరిగి అందజేస్తారని తెలిపారు. ఈ సమావేశాల్లో అదనపు జూనియర్ సివిల్ జడ్జి అఖిల, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, అదనపు ఎస్పీ ఎ.నరేష్‌కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదులాపురం శ్రీనివాస్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇందరపు శివకుమార్, డీఎస్పీలు సంపత్‌రావు, సూర్యనారాయణ పాల్గొన్నారు.
బీఎంఎస్ రాజీలేని పోరాటం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ, బొగ్గు పరిశ్రమల రక్షణ కోసం బీఎంఎస్ రాజీలేని పోరాటాలు చేస్తోందని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ అన్నారు. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే–8వ గనిలో శుక్రవారం నూతనంగా సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై న సందర్భంగా ‘బీఎంఎస్ కార్మిక భరోసా’ పేరుతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. సింగరేణి అభివృద్ధి విషయంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ సంఘాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు.


