భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో జరుగుతున్న రూ.వేలకోట్ల అవినీతి అక్రమాలపై సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్‌తో విచారణ జరిపించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో.. సింగరేణి పరిరక్షణ సదస్సుకు హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సింగరేణిలో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని వివరించారు. తెలంగాణకు సింగరేణి అమూల్యమైన సంపద అని, 137 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. గతంలో లాభాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లతో ఉన్న సంస్థ ప్రస్తుతం జీతాల చెల్లింపుల కోసం కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితికి చేరుకుందన్నారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరుతో టెండర్ల వ్యవస్థలో కొత్త నిబంధనలు తీసుకువచ్చి కొందరికి లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో మైనస్‌కు వెళ్లిన ఓబీ టెండర్లు ప్రస్తుతం అదనపు ధరలకు కేటాయిస్తున్నారని, దీనివల్ల సింగరేణికి వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు.
బొగ్గు నిల్వల్లో భారీ వ్యత్యాసాలు..
బొగ్గు నిల్వల లెక్కల్లో కూడా భారీ వ్యత్యాసాలు ఉన్నాయని, లక్షల టన్నుల బొగ్గు మాయమైనప్పటికీ అధికారులు స్పందించడం లేదన్నారు. భూపాలపల్లి బొగ్గు బాయి మీద 3లక్షల మెట్రికల్ టన్నుల బొగ్గు లేదని, 40లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటే ఎవరూ సమాధానం చెప్పడం లేదన్నారు. మూతపడిన అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్ట్ వద్ద 1.81లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అధికారులు లెక్కలు చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎక్స్‌ప్లోజివ్స్ కొనుగోళ్లలో మార్కెట్ ధర రూ.37వేలు ఉంటే అధిక ధరలు రూ.44వేలకు కొనుగోలు చేసి కోట్లాది రూపాయల నష్టం కలిగించారని ఆరోపించారు. డీజిల్ కొనుగోళ్లను ప్రభుత్వ సంస్థలనుంచి కాకుండా ప్రైవేట్ వ్యవస్థలకు అప్పగించడం ద్వారా అదనపు ఆర్థికభారం మోపుతున్నారని విమర్శించారు. వీటన్నింటిలో నిజాలు తేలాలంటే సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనచారి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతిరాథోడ్, జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పుట్ట మధు, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నాయకులు టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, వాసుదేవరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కాగా, అంతకుముందు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు–2 సందర్శించేందుకు వెళ్లిన హరీశ్‌రావు, నాయకులను అనుమతి లేదని సింగరేణి అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగగా, ఉన్నతాధికారులను అనుమతి తీసుకుని రావాలని చెప్పడంతో బీఆర్‌ఎస్ నాయకులు అక్కడినుంచి వెనక్కి వచ్చారు.
రెండున్నరేళ్లలో సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టిన కాంగ్రెస్
టెండర్లలో కొందరికే లబ్ధి చేకూరేలా నూతన నిబంధనలు
సింగరేణి పరిరక్షణ సదస్సులో
మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు


