ములుగు రూరల్: రాంచంద్రాపురం భూములకు పట్టాల పంపిణీ ద్వారా భావితరాలకు శాశ్వత భూ హక్కులు కల్పిస్తున్నామని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వేగంగా పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శుక్రవారం మల్లంపల్లి మండలం రాంచంద్రాపురం రైతు వేదికలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో మల్లంపల్లి, రాంచంద్రాపురం, గుర్తూర్‌తండా, భూపాల్‌నగర్, శివతండా, కొడిశలకుంట, ముద్దునూరుతండా ప్రజల నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రాంచంద్రాపురం పరిధిలో 10,600 ఎకరాల భూములకు సంబంధించి 30, 40 సంవత్సరాలుగా కొనసాగుతున్న సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. రాంచంద్రాపురం గ్రామ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కోయగూడెం జిల్లా పరిషత్ పాఠశాలలో శానిటేషన్ డ్రైవ్‌లో పా ల్గొని పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. అమ్మ మాట అంగన్‌వాడీబాట కార్యక్రమంలో భాగంగా మల్లంపల్లి సెక్టార్ పరిధిలో ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ వికాస్ మీనా, అదనపు కలెక్టర్‌లు మహేందర్‌జీ, సంపత్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, ఆర్డీఓ కృష్ణవేణి, పంచాయతీరాజ్ డైరెక్టర్ భగవాన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బొక్క సత్తిరెడ్డి , తహసీల్దార్లు, ఎంపీడీఓలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
యువత క్రీడల్లో రాణించాలి
యువత క్రీడల్లో రాణించాలని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో అస్మిత సైక్లింగ్ పోటీల పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ క్రీడలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వ్యక్తిగత నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఉపయోగ పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, డీఎఫ్‌ఓ వికాష్‌మీనా, అదనపు కలెక్టర్ సంపత్‌రావు, సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్, తదితరులు ఉన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే
ప్రభుత్వ లక్ష్యం
మంత్రి ధనసరి సీతక్క


