జిల్లాలో 1.06 లక్షల గృహాలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో 1.06 లక్షల గృహాలు

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

ములుగు: జనగణనలో మొదటి అంకం పూర్తయింది. జిల్లాలో గృహాల గుర్తింపు ప్రక్రియ మంగళవారం పూర్తి కాగా జిల్లా వ్యాప్తంగా 1,06,145 గృహాలు ఉన్నట్లు ఎన్యూమరేటర్లు గుర్తించారు. ఇందులో ములుగు మున్సిపాలిటీ పరిధిలో 6,952 గృహాలు ఉండగా 18,652 జనాభా ఉంది. అలాగే జిల్లా వ్యాప్తంగా 10 మండలాల పరిధిలో 99,193 గృహాలు ఉండగా 2,94,510 జనాభా ఉన్నట్లు నిర్ధారించారు. ఫిబ్రవరి–2027లో జనాభాను అధికారికంగా లెక్కించేందుకు అధికారులు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు.

29 రోజుల పాటు కొనసాగిన సర్వే

జనగణన కార్యక్రమంలో భాగంగా తొలి ప్రాధాన్యతలో గృహగణన కార్యక్రమాన్ని మే 11 నుంచి జూన్‌ 9వ తేదీ వరకు డిజిటల్‌ విధానంలో ఎన్యుమరేటర్లు సర్వే చేపట్టారు. జిల్లాలో 815 హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్స్‌ గుర్తించి ప్రతీ బ్లాక్‌లో 250 నుంచి 300 గృహాలు సర్వే చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రతీ 300 గృహాలకు ఒక ఎన్యుమరేటర్‌ చొప్పున 370 మందికి పైగా ఎన్యుమరేటర్లను నియమించి జిల్లాలో గృహగణన నిర్వహించారు. గృహగణనలో ఎన్యుమరేటర్‌ ప్రతీ ఇంటికి వెళ్లి 33 ఆంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.

100 శాతం గృహగణన పూర్తి

జిల్లాలోని 10 మండలాల పరిధిలో 99,193 గృహాలు ఉన్నాయి. ఇందులో ములుగు మున్సిపాలిటీ పరిధిలో 6,952 గృహాలు ఉన్నట్లు ఎన్యుమరేటర్లు నిర్ధారించారు. సుమారు 370 మందికి పైగా ఎన్యుమరేటర్లు మండుటెండలో సైతం గృహగణన కార్యక్రమాన్ని చేపట్టి 100 శాతం పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా డిజిటల్‌ పద్ధతిలో జనగణన కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగానే గృహగణన కార్యక్రమాన్ని జూన్‌ 9న పూర్తి చేశారు. ఫిబ్రవరి 2027లో జనగణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

వాజేడులో గృహగణనలో భాగంగా వివరాలు నమోదు చేసుకుంటున్న ఎన్యుమరేటర్‌

ములుగు మున్సిపాలిటీ పరిధిలో గృహగణన చేస్తున్న ఎన్యుమరేటర్‌

జనగణనలో మొదటి అంకం పూర్తి

పట్టణంలో 6,952,

పల్లెల్లో 99,193 ఇళ్లు

గృహగణన 100 శాతం పూర్తి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement