మార్కెట్‌లోకి ‘మా శక్తి’ ఉత్పత్తులు | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి ‘మా శక్తి’ ఉత్పత్తులు

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

ములుగు: జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను ఇకపై మా శక్తి బ్రాండ్‌ పేరుతో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావుతో కలిసి మంత్రి మా శక్తి బ్రాండ్‌ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సంఘాలు తయారు చేస్తున్న పసుపు, కారం, ఇప్పపువ్వు ఉత్పత్తులు, హస్త కళలు, పెయింటింగ్స్‌, బొమ్మలు, టైలరింగ్‌ ఉత్పత్తులు తదితర వస్తువులకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు మా శక్తి బ్రాండ్‌ను రూపొందించినట్లు తెలిపారు. బ్రాండింగ్‌, ప్యాకింగ్‌, లేబులింగ్‌ ద్వారా ఉత్పత్తులకు విలువ పెరగడంతో పాటు మార్కెట్లో విశ్వసనీయత, గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులను జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి డిజిటల్‌ వేదికల ద్వారా విక్రయాలకు అవకాశం కల్పించి మహిళల ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. జిల్లాలో మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు ఒకే బ్రాండ్‌, ఒకే గుర్తింపు కల్పించడం ద్వారా జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని తెలిపారు. అలాగే మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెట్లో ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడుతుందని వివరించారు. మేడారం, లక్నవరం, బొగత జలపాతం, రామప్ప వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో మహిళా సంఘాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి పర్యాటకులకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సంపత్‌ రావు, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోతు రవిచందర్‌, మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ చింతనిప్పుల చంద్రకళ, అదనపు డీఆర్‌డీఓ గొట్టె శ్రీనివాస్‌, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పద్మ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వైద్యసేవల్లో ఆదర్శంగా నిలవాలి

రాష్ట్రంలోనే ములుగు జిల్లా వైద్యసేవల్లో ఆదర్శంగా నిలవాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు ఆధ్వర్యంలో వైద్య సేవల విస్తరణ, వర్షాకాల ఆరోగ్య సన్నద్ధతపై గురువారం మంత్రి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి

ధనసరి సీతక్క

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement