ఆక్యుప్రెషర్‌ పార్కు నిరుపయోగం | - | Sakshi
Sakshi News home page

ఆక్యుప్రెషర్‌ పార్కు నిరుపయోగం

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాకేంద్రంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ, నడక వ్యాయామం కోసం సుమారు రూ.36.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఆక్యుప్రెషర్‌ పార్కు ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. ఎంతో ఆశయంతో నిర్మించిన ఈ పార్క్‌ మూడేళ్లుగా ప్రజలకు అందుబాటులో లేక పాడుబడిపోతోంది. భూపాలపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం ఎదురుగా ప్రైవేట్‌ వెంచర్‌లో గ్రీన్‌ బడ్జెట్‌లో నిర్మించిన ఈ పార్క్‌లో ఆక్యుప్రెషర్‌ ట్రాక్‌, పచ్చదనం, వ్యాయామ, విశ్రాంతి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ప్రారంభ రోజుల్లో కొంతమంది ప్రజలు వినియోగించినప్పటికీ, అనంతరం సరైన నిర్వహణ లేకపోవడంతో పార్క్‌ క్రమంగా నిర్లక్ష్యానికి గురైంది. ప్రస్తుతం పార్క్‌ ప్రవేశ ద్వారం వద్దనే పాడుబడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోపల కలుపు మొక్కలు పెరిగిపోవడం, పరికరాలు దెబ్బతినడం, శుభ్రత లేకపోవడం వల్ల ప్రజలు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పార్క్‌లోని కొంతభాగం దెబ్బతింది. ప్రజాధనంతో నిర్మించిన ఈ పార్కు ప్రజలకు ఉపయోగపడకుండా ఉండటంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. లక్షల రూపాయలతో నిర్మించిన ఆస్తిని సంరక్షించడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. పార్కును వెంటనే పునరుద్ధరించి, దెబ్బతిన్న భాగాలకు మరమ్మతులు చేపట్టి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సి న అవసరం ఉంది. ఆరోగ్యానికి ఉపయోగపడే ఇటువంటి వనరులు నిర్లక్ష్యానికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

రూ.36.50 లక్షల ప్రజాధనం వృథా

నిర్వహణ లేక శిథిలావస్థకు..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement