తయారీ క్లోజ్‌ | - | Sakshi
Sakshi News home page

తయారీ క్లోజ్‌

Jun 11 2026 7:53 AM | Updated on Jun 11 2026 7:53 AM

ఆదరణ లేక మూతపడిన న్యూట్రిమిక్స్‌, డ్రైమిక్స్‌ తయారీ కేంద్రం

న్యూట్రిమిక్స్‌, డ్రైమిక్స్‌ తయారీ వివరాలు

ఆదరణ లేక మూతపడిన న్యూట్రిమిక్స్‌, డ్రైమిక్స్‌ తయారీ కేంద్రం

ఆర్డర్లు

నిల్‌..

ఏటూరునాగారం: మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం న్యూట్రిమిక్స్‌, డ్రైమిక్స్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అధికారులు పట్టింపులేనితనంతో ఆర్డర్లు రాక.. ఉత్పత్తి నిలిచిపోయిందని గ్రూపు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయల విలువ చేసే మిషనరీ తుప్పుపడుతున్నా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పరిశ్రమ చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు

ఐటీడీఏ పరిధిలోని అప్పటి ప్రభుత్వం ట్రైకార్‌ ద్వారా గిరిజన మహిళా సంఘాలకు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు రూ. 39 లక్షల బడ్జెట్‌ను కేటాయించింది. దీంతో ఏటూరునాగారంలో 2022–23లో ఐటీడీఏ కార్యాలయానికి కూతవేటు దూరంలోని క్రాస్‌రోడ్డులో స్వయంకృషి జాయింట్‌ లయబిలిటీ గ్రూపు పేరుతో పది మంది సభ్యులు కలిసి న్యూట్రిమిక్స్‌, డ్రైమిక్స్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తొలుత ఆరు నెలలకు సరిపడా ఇండెంట్‌లు రావడంతో న్యూట్రిమిక్స్‌, డ్రైమిక్స్‌ తయారు చేసి పంపిణీ చేశారు. ఆపై ఆర్డర్లు రాకపోవడంతో పరిశ్రమ మూతపడింది. ఆ తర్వాత 2025 నవంబర్‌లో ఐటీడీఏ నుంచి ఆర్డర్స్‌ ఇవ్వడంతో ఉత్పత్తులను తయారు చేసి అందజేశారు. అనంతరం మళ్లీ అర్డర్లు లేకపోవడంతో ఉత్పత్తి చేయలేమని నష్టం వస్తుందని దానిని సభ్యులు మూసివేశారు. పరిశ్రమకు తాళాలు వేసి ఉండడంతో చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి అధ్వానంగా తయారైంది. గిరిజన మహిళలకు అప్పగించిన ఈ పరిశ్రమ మూతపడడంతో మిషనరీ అంతా తుప్పు పడుతున్న పరిస్థితి నెలకొంది.

10శాతం నగదు.. 50శాతం సబ్సిడీ

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ట్రైకార్‌ ద్వారా ప్రభుత్వం రూ. 39 లక్షలు వెచ్చించగా అందులో 10 శాతం నగదును వాటా దారులైన మహిళలు చెల్లించారు. ప్రభుత్వం 60 శాతం సబ్సిడీ రూపంలో బ్యాంకులో జమ చేసింది. మిగతా 30 శాతం నిధులు బ్యాంకు రుణంగా అందజేసింది. దీంతో పరిశ్రమను నెలకొల్పిన మహిళలు పచ్చజొన్నలు, తెల్లజొన్నలు, రాగులు, పల్లీలను కలిపి డ్రైమిక్స్‌ పౌడర్‌ను తయారు చేసి ఐటీడీఏ పరిధిలోని గిరిజన విద్యాసంస్థలలో చదువుకుంటున్న విద్యార్థులకు గతంలో అందజేశారు.

విద్యార్థులకు అందని పౌష్టికాహారం

ఆ తర్వాత పరిశ్రమ మూసివేయడంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందకుండా పోయింది. ఈ విషయంపై గతంలో సాక్షి పలుమార్లు కథనాలు రాయగా అప్పటి పీఓ చిత్రామిశ్రా పరిశ్రమకు డిమాండ్‌ ఆర్డన్‌ను అందజేసి తెరిపించారు. నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు పరిశ్రమ నడిపి ఉత్పత్తి చేసి జీసీసీ ద్వారా విద్యాసంస్థలకు సరఫరా చేశారు. కానీ ఆ తర్వాత మార్చి నుంచి మూసివేశారు. దీంతో మహిళలకు ఇచ్చిన లక్షలాది రూపాయల విలువచేసే పరిశ్రమ పాడైపోగా.. పిల్లలకు పౌష్టికాహారమైన డ్రైమిక్స్‌ పౌడర్‌ కూడా అందకుండా పోతుంది. అయితే పాఠశాలలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. కానీ ఎలాంటి ఆర్డర్స్‌ లేకపోవడంతో ఇప్పటి వరకు కూడా తయారీ మొదలు పెట్టలేదు. ఈ విషయంపై సాక్షి ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పోను సంప్రదించగా దానిని పరిశీలించి తెరిపించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

సంవత్సరం ఉత్పత్తి వ్యాపారం

2023 1,600(కిలోలు) రూ.25.6లక్షలు

2025 1,000(కిలోలు) రూ.16లక్షలు

పట్టించుకోని ఐటీడీఏ అధికారులు

తుప్పుపడుతున్న మిషనరీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement