ములుగు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని, ఉపాధి హామీ పనుల్లో కూలీల భాగస్వామ్యాన్ని పెంచాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య గణనీయంగా పెంచాలన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వీవో భవనాల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసేలా చూడాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందిస్తూ నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. నాటిన మొక్కల సంరక్షణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. జిల్లాలో అమలవుతున్న వివిధ కేటగిరీల సామాజిక భద్రత, పింఛన్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో అందిన పింఛన్ల దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి అర్హులైన వారి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంక్‌కు సంబంధించి అవసరమైన అన్ని అనుమతులు త్వరితగతిన పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాడ్వాయి మండలం కొండపర్తిలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిర్చి, పసుపు ప్రాసెసింగ్ యూనిట్, ఇప్పపూల లడ్డు తయారీ యూనిట్ కార్యకలాపాలు, ఉత్పత్తుల క్రయవిక్రయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్, అదనపు పీడీ శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు


