ములుగు: పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ములుగు మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ పేర్కొన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 16, 19 వార్డులలో కౌన్సిలర్ల ఆధ్వర్యంలో వార్డు సభలు బుధవారం నిర్వహించగా ఆమె హాజరై మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. వర్షాకాలంలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుని సీజనల్ వ్యాధులు, దోమల వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. పట్టణంలోని విద్యుత్, మౌలిక సదుపాయాల సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్‌రెడ్డి, సీడీపీఓ కె.శిరీష, ఆర్‌ఐ యుగంధర్ రెడ్డి, ములుగు సబ్ ఇన్‌స్పెక్టర్ ఇమాన్యుయల్, మున్సిపల్ కౌన్సిలర్ కుతుబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
18వ వార్డు సభను బహిష్కరించిన కౌన్సిలర్
ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను గౌరవించడం లేదంటూ 18వ వార్డు కౌన్సిలర్ బైకాని అనూషసాగర్ తన వార్డులో చేపట్టిన సభను బహిష్కరించారు. ప్రజలచే ఎన్నుకోబడిన తమ పేర్లను శిలాఫలకాలపై నమోదు చేయడం లేదని విచారం వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఛైర్‌పర్సన్ చంద్రకళ


