గోవిందరావుపేట: ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు డీఈఓ సిద్ధార్థరెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచ్ బానోత్ నిర్మల వెంకన్న ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఇల్లిల్లూ తిరుగారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఉంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులు విద్యాబోధన అందిస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించామన్నారు. ఇటీవల నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలకు నిదర్శనమన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ వల్లపు మహేశ్, పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మీ, వార్డు సభ్యులు మాలోతు శంకర్, తేజావత్ హుని, లిక్కి కుమారస్వామి, కూరాకుల సురేశ్, గ్రామస్తులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
డీఈఓ సిద్ధార్థ రెడ్డి


