● ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని గి రిజన పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచాలని, బడిబాట ముమ్మరంగా చేపట్టా లని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. సోమవారం మండలకేంద్రంలోని తన కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్లు, మానిటరింగ్ అధికారులు, రిసోర్స్ పర్సన్‌లతో గూగుల్ మీటింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ జూన్ 15వ తేదీన పాఠశాలలు తెరుచుకునే నాటికి అధికారులు తమతోపాటు ఉపాధ్యాయులను విద్యార్థుల వద్దకు పంపిస్తూ హాజరు శాతాన్ని పెంచాలన్నారు. ప్రతీ విద్యార్థికి ప్రభుత్వం కేటాయిస్తున్న ఖర్చును వివరించాలన్నారు. సున్నా నమోదు ఉన్న గిరిజన సంక్షేమ సంస్థల్లో విద్యార్థులను తప్పనిసరిగా చేర్పించాలన్నారు. విద్యాసంస్థల్లో తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు సరిగా ఉన్నాయా లేదా రిపోర్ట్ చేయాలన్నారు. డీడీలు, డీటీడీఓలు, ఏటీడీఓలు పాఠశాలలను తిరిగి సమస్యలను గుర్తించాలన్నారు. హెడ్మాస్టర్లు, వార్డెన్లు వారి సంస్థల పనితీరును మరింత మెరుగుపర్చాలన్నారు. గిరిజన సంక్షేమ సంస్థల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట అదనపు ఉపాధ్యాయుల కోసం అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీడీ ఫిరంగి, దేశిరామ్, నారాయణరెడ్డి, భూపాలపల్లి డీటీడీఓ గొట్టిముక్కుల నాగసాగర్, ఏటీడీఓలు శివకృష్ణ, హసీనా, ఉపేందర్, రవీందర్, వాగ్యా, రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


