జిల్లాలో 1.16 లక్షల మెట్రిక్ టన్నుల యాసంగి ధాన్యం సేకరణ
ములుగు రూరల్: జిల్లాలో యాసంగి (రబీ) ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసింది. పీఏసీఎస్, జీసీసీ, ఐకేపీ, రైతు సంఘాల ఆధ్వర్యంలో మొత్తం 149 కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేపట్టారు. కల్లాల్లో ధాన్యం ఆరబోసిన రైతులు ధాన్యం అమ్మకాలకు పడిన అవస్థలు అంతాఇంతా కాదు. అకాల వర్షం, గన్నీ బ్యాగుల కొరత, లారీల కొరత కారణంగా ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి రవాణా డబ్బులు చెల్లించి ధాన్యం ఎగుమతులు చేపట్టారు. దీంతో రెండు రోజుల క్రితం ధాన్యం కొనుగోళ్ల ముగింపు ప్రకటించారు.
జిల్లాలో 1.20 లక్షల
మెట్రిక్ టన్నుల అంచనా..
జిల్లాలోని పది మండలాల్లో మొత్తం యాసంగి దిగుబడి అంచనా 1.08 లక్షల మెట్రిక్ టన్నులుగా అధికారులు అంచనా వేశారు. అంచనాలకు మించి ధాన్యం కల్లాలకు రావడంతో కొనుగోలు అంచనా 1.20 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ద్వారా 1,16,121 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేపట్టి మిల్లులకు తరలించారు. జిల్లాలో 11,277 మంది రైతులకు ఇప్పటి వరకు రూ.218.51 కోట్లను బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇప్పటికీ ట్యాబ్ ఎంట్రీ కాని రైతులకు సుమారు రూ.50 కోట్ల వరకు ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉంది.
11,277 మంది రైతులకు రూ.218.51 కోట్లు చెల్లింపు
సుమారు రూ.50కోట్లు పెండింగ్


