పల్స్‌ పోలియోను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పల్స్‌ పోలియోను విజయవంతం చేయాలి

Jun 9 2026 8:34 AM | Updated on Jun 9 2026 8:34 AM

కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు

ములుగు: చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు చేపడుతున్న పల్స్‌ పోలియో, స్టాప్‌ డయేరియా క్యాంపెయిన్‌, జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆయా కార్యక్రమాలపై జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 0–5 సంవత్సరాల వయస్సు గల ప్రతీ చిన్నారికి పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. వలస కార్మికులు నివసించే ప్రాంతాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనుల ప్రాంతాలు వంటి ప్రాంతాలను గుర్తించి అక్కడి పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలన్నారు. వర్షాకాలంలో ప్రబలే డయేరియా వ్యాధి నివారణకు గ్రామీణ స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జూలై నెలలో నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్‌, పురపాలక శాఖల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ గోపాల్‌రావు మాట్లాడుతూ జూన్‌ 28న పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, జిల్లాలో 22,572 మంది 0–5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి 312 పోలియో బూత్‌లు, మొబైల్‌ బృందాలు, ట్రాన్సిట్‌ పాయింట్లు, అధిక ప్రమాద ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జూన్‌ 15 నుంచి జూలై 31 వరకు స్టాప్‌ డయేరియా క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నామని, జూలై 13, 20 తేదీల్లో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఒకటి నుంచి 19 సంవత్సరాలలోపు పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా మాస్‌ మీడియా అధికారి సంపత్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈవీఎం గోదాం తనిఖీ

కలెక్టరేట్‌ ఆవరణలోని ఈవీఎం గోదాంను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్‌ త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. గోదాం సీల్‌ను, సీసీ కెమెరాల పనితీరు, ఇతర భద్రత పరికరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎలక్షన్‌ సెల్‌ సూపరింటెండెంట్‌ సలీం, డిప్యూటీ తహసీల్దార్‌ నితీష్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement