ములుగు: విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారాన్ని అందించాలని, పాఠశాలలు, వసతి గృహాల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, విద్యార్థులకు సురక్షిత, పరిశుభ్రమైన వాతావరణం కల్పించి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం మంత్రి సీతక్క టెలీకాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావుతో కలిసి సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని, పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అన్ని విద్యాసంస్థల భవనాలు, తరగతి గదులు, వంటశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి ట్యాంకులను పూర్తిస్థాయిలో శుభ్రపరచాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో పాఠశాల ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, దోమల నివారణకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు, సామాజిక సేవ, సంస్కృతి, సంప్రదాయాలు, మంచి అలవాట్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ‘నమస్కారం–మన సంస్కారం’ అనే భావనను విద్యార్థుల్లో పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాల ప్రాముఖ్యత, స్థల పురాణా లను విద్యార్థులకు తెలియజేసే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పదో తరగతి ఫలితాల్లో ములుగు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడానికి కృషి చేసిన జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పాఠశాలల్లో వైద్య శిబిరాలు, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ రవికుమార్, ఆర్డీఓ కృష్ణవేణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పాఠశాలల పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి
మంత్రి ధనసరి సీతక్క


