వెంకటాపురం(కె): మండల పరిధిలోని మోట్లగూడెంలోని ఎంపీపీ పాఠశాలకు ప్రభుత్వ భవనం లేకపోవటంతో గ్రామస్తులు సమష్టిగా గ్రామంలో గతేడాది పాకను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఈ ఏడాది సైతం పాఠశాల అదే పాకలో కొనసాగించనుండడంతో పైకప్పు దెబ్బతిని ఉంది. దీంతో వర్షాకాలంలో ఉరిసే అవకాశం ఉండడంతో మరమ్మతులు చేపట్టారు. గ్రామస్తులు సమష్టిగా పాఠశాల పైకప్పుకు తాటాకులు, కోర గడ్డిని తీసుకొచ్చి కప్పారు. పాఠశాల చుట్టూ గ్రీన్‌మెట్ ఏర్పాటు చేసి ఆవరణను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు ఇర్పా పెంటయ్య, కుర్సం ఎడమయ్య, సమ్మయ్య, శ్రీను, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.


