జిల్లాలో 171 నర్సరీల్లో
5.64 లక్షల మొక్కలు
జిల్లాలోని నర్సరీల వివరాలు
ఏటూరునాగారం:రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు గ్రామ పంచాయతీల పరిధిలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కల పెంపకం చేపట్టింది. వేసవిలో మొదలైన మొక్కల పెంపకం వర్షాకాలం ప్రారంభం నాటికి మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టింది. జిల్లాలోని 174 గ్రామ పంచాయతీల్లో 171 నర్సరీలను ఏర్పాటు చేసింది. 5,64,950 లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇంటికి ఐదు మొక్కలు ఇచ్చేలా..
పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భూగర్భ జలాల పెంపకం, గ్రామాలు పచ్చదనంతో ఆహ్లాదంగా ఉండేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. నర్సరీల్లో పెరిగిన మొక్కలను ఇంటికి ఐదు మొక్కల చొప్పున ఇచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో పండ్లు, పూల మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. అంతేకాకుండా మొక్కలు నాటినందుకు, గోతులు తీసినందుకు కూడా ఈజీఎస్ ద్వారా డబ్బులు చెల్లించనున్నారు. ఉపాధి హామీ కార్డు ఉన్న కూలీలను ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములను చేయనున్నారు.
సంరక్షణ జీపీల బాధ్యత
గ్రామంలోని ఇళ్ల పరిసరాలు, రోడ్ల పక్కన, ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను నాటించనున్నారు. నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేసి నీటి సదుపాయాలను కల్పించేందుకు జీపీకి బాధ్యతలను అప్పగించారు. వీటితో పాటు విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, రైతులను భాగస్వామ్యం చేయనున్నారు.
ఉచితంగా పంపిణీ
వేప, రావి, మర్రి, కానుగ, నేరేడు, ఉసిరి, మామిడి, జామ, సీతా ఫలాలు, గులాబీ, మల్లె, పచ్చని పూలు మొక్కలను పంపిణీ చేయనున్నారు. ఎక్కువగా గ్రామ పంచాయతీల నర్సరీల్లో పండ్లు, పూల మొక్కలు మాత్రమే ఉండగా నీడనిచ్చే మొక్కలను అటవీశాఖ ద్వారా పెంచే నర్సరీల ద్వారా ప్రజలకు ఉచితంగా అందించనున్నారు. దీనివల్ల ఇళ్లలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫలాలు, పూలు పుష్కలంగా లభించే అవకాశాలున్నాయి. వీటితో పాటు గతేడాది నాటిన మొక్కలు ఉంటే వాటి స్థానంలో కొత్త మొక్కలను కూడా నాటించనున్నారు. ఏ మొక్క ఎలా ఉందని తెలిసేందుకు కూడా జియోట్యాగింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించనున్నారు. వర్షాలు పడే వరకు మొక్కలను ఏపుగా పెరిగేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
గ్రామాల్లో ఉచితంగా పంపిణీ
చేసేందుకు సిద్ధం
గృహాల్లో పెంచేందుకు పండ్లు,
పూల మొక్కలు
మండలం జీపీలు నర్సరీల టార్గెట్
ఏటూరునాగారం 12 37,060
గోవిందరావుపేట 18 68,000
కన్నాయిగూడెం 11 34,000
మల్లంపల్లి 10 37,000
మంగపేట 25 78,000
ములుగు 19 58,600
ఎస్‌ఎస్ తాడ్వాయి 18 58,600
వెంకటాపురం(కె) 23 80,090
వెంకటాపురం(ఎం) 18 59,600
వాజేడు 17 54,000


