మంగపేట: మండల పరిధిలోని మల్లూరు హేమాచల క్షేత్రంలోని లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. సెలవురోజు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి, గుంటూరు నుంచి భక్తులు భారీ సంఖ్యలో వివిధ వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్నారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వయంభు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ పూజారులు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు.


