వెంకటాపురం(కె): మండ పరిధిలోని యాకన్నగూడెం గ్రామ సమీపంలోని రాళ్ల వాగుపై నూతన బ్రిడ్జిని నిర్మించాలని బీజేపీ జిల్లా కార్యదర్శి అట్లూరి రఘురాం అన్నారు. ఈ మేరకు బీజేపీ నాయకులు ఆదివారం శిథిలావస్థలో ఉన్న రాళ్లవాగు బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ రాళ్లవాగు పై ఉన్న బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుందన్నారు. దీంతో బ్రిడ్జి గడ్డర్లు దెబ్బతిన్నాయన్నారు. బ్రిడ్జి ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. దీనికి ప్రత్యామ్నాయ వంతెన నిర్మించకపోతే రవాణా స్తంభించే ప్రమాదం ఉందని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నూతన వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంకిశోర్, శ్రీకిషన్, శేఖర్, అంకా దుర్గ, సాయి ప్రసాద్, ఉప్పల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


