మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ ప్రతిష్టాత్మక భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలుస్తోంది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ , ప్రియాంక చోప్రా కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు ఐమాక్స్ (IMAX) అనుభవాన్ని ఇవ్వాలని మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఒక వేదికపై రాజమౌళి మాట్లాడుతూ సినిమాను ఐమ్యాక్స్ వెర్షన్‌లో తీస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఐమ్యాక్స్ వెర్షన్‌లో ‘వారణాసి’ స్పెషల్ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. ఇప్పుడు మెక్సికోలో వారణాసి మూవీలోని ఐమ్యాక్స్ వెర్షన్ సీన్స్‌ను ప్రదర్శించనున్నారు.
‘వారణాసి’ సినిమా మొత్తం ట్రూ ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో ఉండదని రాజమౌళి ఇప్పటికే చెప్పారు. కేవలం కీలక సన్నివేశాల్లో మాత్రమే ఆ ఫార్మాట్‌ను ఆస్వాదిస్తారని గతంలో తెలిపారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నుంచి తాజాగా ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. 2026 ఏప్రిల్ 24న జరిగే సీసీఎక్స్‌పీ మెక్సికో (CCXP Mexico)లో 'వారణాసి' మూవీ నుంచి CCXP మెక్సికో అభిమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రివ్యూతో పాటు, మునుపెన్నడూ చూడని తెర వెనుక దృశ్యాలను ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని ఎస్.ఎస్. కార్తికేయ అధికారికంగా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఆయన స్వయంగా హాజరవుతుండగా, రాజమౌళి ప్రత్యేకంగా రికార్డ్ చేసిన వీడియో సందేశం ద్వారా ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
CCXP Mexico (Comic Con Experience Mexico) అనేది లాటిన్ అమెరికాలో జరుగుతున్న అతిపెద్ద పాప్ కల్చర్. ఇందులో కొత్త సినిమాలు, సిరీస్‌ల ట్రైలర్ లాంచ్‌లు ముఖ్యంగా జరుగుతుంటాయి. ఇక్కడ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ ముందుగానే చూడొచ్చు. సినీ అభిమానులకు ఇదొక డ్రీమ్ ఈవెంట్.


