తగ్గిపోయిన సినిమాల 'లైఫ్'.. ఎవరు దీనికి కారణం? | Story On How Telugu Movies Theatrical Life Span Decreased To Three Days, From 100 Day Runs To Weekend Verdicts | Sakshi
Sakshi News home page

Tollywood: టాలీవుడ్‌ని భయపెడుతున్న నయా ట్రెండ్

Apr 25 2026 5:08 PM | Updated on Apr 25 2026 5:43 PM

AI Image

AI Image

మనిషి జీవితం రోజురోజుకీ మారుతోంది. మరోవైపు సినిమాలు తీసే, చూసే విధానం కూడా మారుతోంది. ఒకప్పుడు స్టార్ హీరోతో కమర్షియల్ మూవీ తీస్తే చాలు.. కథ కొంచెం అటుఇటుగా ఉన్నాగానీ 50, 100 రోజుల పాటు ఆడేవి. మరి ఈ తరహా చిత్రాలపై జనాలకు మోజు తగ్గిందో లేదంటే నిర్మాతల అత్యుత్సాహం కొంపముంచుతోందో తెలియట్లేదు గానీ తెలుగు సినిమాల జీవితకాలం తగ్గిపోయింది. కేవలం మూడంటే మూడు రోజులకు వచ్చేసింది. మరి ఈ పరిస్థితికి ఎవరు కారణం? ప్రస్తుతం ఏం జరుగుతోంది?

ఒకప్పుడు 50,100 రోజుల పాటు సినిమాలు ఆడేవి. తర్వాత అవి వారాలకు వచ్చాయి. ఇప్పుడు మొదటి వీకెండ్ అయ్యేసరికి సినిమా పరిస్థితి అటో ఇటో తేలిపోతోంది. శుక్రవారం రిలీజైన చిత్రానికి ఆదివారం వచ్చేసరికల్లా హిట్ లేదా ఫ్లాప్ అనే ముద్రపడిపోతుంది. హిట్ అయితే సోమవారం నుంచి కాస్తోకూస్తో జనాలు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. ఫ్లాప్ అని టాక్ వస్తే మాత్రం థియేటర్ వైపే చూడట్లేదు.

ఒకప్పుడు సినిమా టాక్ యావరేజ్‌గా ఉన్నా సరే వారం, పదిరోజుల తర్వాత పికప్ అయ్యేది. మౌత్ టాక్ ఇందులో కీలక పాత్ర పోషించేంది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కనీస ఊపిరి పీల్చుకునేంత టైమ్ కూడా సినిమాలకు దొరకట్లేదు. దీనికి కారణం సోషల్ మీడియా. ఒకప్పుడు జనాలు స్వయంగా థియేటర్‌కి వెళ్లి సినిమా చూసి.. నచ్చితే నలుగురికి చెప్పేవారు. కానీ ఇప్పుడు మొదటి షో పూర్తయ్యేసరికే ట్విటర్ రివ్యూలు, పబ్లిక్ టాక్ అని మూవీ రిజల్ట్ చాలా వేగంగా బయటకొచ్చేస్తుంది. దీంతో ఆడియెన్స్ వెళ్లాలా వద్దా అనేది డిసైడ్ అయిపోతున్నారు.

సినిమాల లైఫ్ తగ్గడానికి మరో కారణం 'అంచనాలు'. కొందరు హీరోలు, దర్శకులు.. తమ సినిమాలో అది ఉంది, ఇది ఉంది అని చెప్పి అంచనాలు పెంచేస్తున్నారు. తీరా చూస్తే ఓస్ ఇంత దానికా అంత హడావుడి అని జనాలకు అనిపిస్తోంది. దీంతో ఆయా మూవీస్ నచ్చట్లేదు. ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులు.. ప్రతి మూవీలోనూ 'వావ్ ఫ్యాక్టర్' ఉందా లేదా అని వెతుకుతున్నారు. కథ పక్కనబెడితే సర్‌ప్రైజ్ లేదా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎలిమెంట్స్ లాంటివి ఉన్నాయా లేదా అని చూస్తున్నారు. అలాంటివి లేకపోతే ఆ సినిమాని పట్టించుకోవట్లేదు. దీని వల్ల నెమ్మదిగా సాగే కంటెంట్ ఉన్న చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోతున్నాయి.

ఈ నెలలోనే చూసుకుంటే డెకాయిట్, బైకర్, రాకాస సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. కానీ యావరేజ్‌గా ఉన్నాయని ఆడియెన్స్ ఫిక్సయిపోవడంతో మూడు రోజులకు మించి ఊపు కొనసాగించలేకపోయాయి. చిత్రబృందాలు ఎంతలా ప్రమోషన్స్ చేసినా ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. ఒకప్పుడు ఈ తరహా చిత్రాలకు లాంగ్ రన్ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటిదేం లేదంటేనే పరిస్థితి ఎంతలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడివే దర్శకనిర్మాతలకు ‍అతిపెద్ద సవాళ్లుగా మారిపోయాయి. ఇండస్ట్రీ ధోరణి కూడా మొదటి వీకెండ్ అయ్యేసరికి ఎలాగోలా డబ్బులొచ్చేస్తే చాలులే అన్నట్లే తయారైంది. మరోవైపు ఆడియెన్స్ టేస్ట్ కూడా మారిపోతోంది. ఒకప్పుడు సినిమాలు చూసి బాగుంది బాగోలేదు అని అనుకునేవారు. కానీ ఇప్పుడంతా ఫస్ట్ డే ఫస్ట్ షోకే డిసైడ్ అయిపోతున్నారు. టాక్ బాగోలేకపోతే సినిమాని నిర్ధాక్ష‍్యిణ్యంగా వదిలేస్తున్నారు. మరోవైపు ఓటీటీలో ప్రతి వీకెండ్ వస్తున్న పరభాషా సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ అవుతున్న తెలుగు చిత్రాల జీవితకాలం తగ్గడానికి ఓ రకంగా కారణమవుతున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం టాలీవుడ్‌కి రాబోయేది గడ్డుకాలమే!

Advertisement
 
Advertisement
Advertisement