Ram Asur Movie Review: రామ్ అసుర్ మూవీ ఎలా ఉందంటే..

Ram Asur Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : రామ్ అసుర్
నటీనటులు : అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, సుమన్, శుభలేఖ సుధాకర్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్ త‌దిత‌రులు 
నిర్మాత : అభిన‌వ్ స‌ర్ధార్‌,వెంక‌టేష్ త్రిప‌ర్ణ
దర్శకత్వం : వెంక‌టేష్ త్రిప‌ర్ణ
సంగీతం :  భీమ్స్ సిసిరోలియో
విడుదల తేది : నవంబర్‌ 19, 2021

ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలకు కూడా ప్రజాదరణ లభిస్తోంది. కథలో బలం ఉంటే చాలు.. హీరో ఎవరనేది పట్టించుకోకుండా థియేటర్స్‌కి వస్తున్నారు ప్రేక్షకులు. అందుకే  విభిన్నమైన కాన్సెప్టులతో చిన్న సినిమాలు తెలుగు తెరను పలకరిస్తున్నాయి. అలా సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమే ‘రామ్ అసుర్’. డైమండ్ చుట్టూ తిరిగే కథకు ఇద్దరి జీవితాల్ని ముడిపెట్టడం ఈ సినిమా ప్రత్యేకత. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌, ట్రైలర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడం, సినిమా ప్రమోషన్స్‌ కూడా డిఫరెంట్‌గా చేయడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి అంచనాలను ‘రామ్ అసుర్’ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే... 
రామ్ (రామ్ కార్తీక్) కృత్రిమంగా వజ్రం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ ఎంత ప్రయత్నించినా సక్సెస్ కాలేడు. అదే సమయంలో తను ప్రాణంగా ప్రేమించిన ప్రియ(షెర్రీ అగర్వాల్‌).. బ్రేకప్‌ చెబుతుంది. దీంతో రామ్‌ బాగా డిస్టర్బ్ అవుతాడు. ఎలాగైన జీవితంలో కోలుకోవాలనే ఉద్దేశంతో స్నేహితుడి సహాయంతో తమిళనాడు వైదీశ్వరున్ కోయిల్‌లోని పండితుడు రామాచారి (శుభలేఖ సుధాకర్)ను కలుస్తాడు. ఆయన సూచన మేరకు సూరి (అభినవ్ సర్దార్) అనే వ్యక్తిని కలవడానికి ప్రయత్నిస్తాడు. ఇంతకీ సూరికి, రామ్ కు సంబంధం ఏంటి? అస్సలు సంబంధం లేని వీళ్లిద్దరి జీవితాలు ఎలా కలిశాయి? సూరి ఎవరు.. అతని నేపథ్యం ఏంటి? చివరగా రామ్‌ కృత్రిమ వజ్రాలను తయారు చేయడంలో సక్సెస్‌ అయ్యాడా? అనేది తెలియాలంటే థియేటర్స్‌కి వెళ్లి ‘రామ్‌ అసుర్‌’చూడాల్సిందే. 

ఎవరెలా చేశారంటే..
సినిమాకి కీలకమైన సూరి పాత్రలో అభినవ్ సర్దార్ ఒదిగిపోయాడు.  ఓ షేడ్ లో లవర్ బాయ్ గా, మరో షేడ్ లో ఎగ్రెసివ్ లుక్‌లో తనదైన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక లవర్‌ బాయ్‌ రామ్‌ పాత్రకి రామ్‌ కార్తీక్‌ న్యాయం చేశాడు. రొమాన్స్‌తో పాటు ఫైట్‌ సీన్స్‌లో కూడా అదరగొట్టేశాడు.షెర్రీ అగర్వాల్ తన గ్లామర్ డోస్ తో ఆకట్టుకోగా.. చాందిని తమిళరాసన్ తన పెర్ఫార్మెన్స్ తో ఎట్రాక్ట్ చేసింది. ఇక ఈ సినిమాలో మరో కీలకమైన శివ పాత్రలో శాన్వీ సాల్మన్ అద్భుతమైన నటనను కనబరిచాడు. విభిన్నమైన పాత్రని చాలా అవవోకగా పోషించి మెప్పించాడు. రామాచారిగా శుభలేఖ సుధాకర్, బలరాం రాజుగా సుమన్‌తో మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఎలా ఉందంటే..?
కృత్రిమంగా డైమండ్ తయారుచేయడమనే కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే ‘రామ్‌ అసుర్‌’.ఈ కాన్సెప్ట్ కు రెండు విభిన్న జీవితాల్ని ముడిపెట్టడం ఈ సినిమాకు మరింత కొత్తదనం తీసుకొచ్చాడు దర్శకుడు వెంక‌టేష్ త్రిప‌ర్ణ. అయితే ఇంత మంచి కాన్సెప్ట్ ను తెరపైకి పకడ్బందీగా తీసుకొచ్చారా అంటే మాత్రం పూర్తిగా అవునని చెప్పలేం. బడ్జెట్ పరిమితులు ఓవైపు, బలమైన స్టార్స్ లేకపోవడం మరోవైపు ఈ సినిమాను కాస్త వెనక్కి లాగినట్టు అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో రామ్ కార్తీక్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అతడి లవ్ ట్రాక్, రొమాన్స్ కు ఎక్కువ స్పేస్ ఇచ్చారు. ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేవరకు కథ స్లోగా సాగుతుంది.

అయితే ఎప్పుడైతే సెకెండాఫ్ స్టార్ట్ అవుతుందో ఇక అక్కడ్నుంచి 'రామ్ అసుర్' పరుగులుపెడుతుంది. ఈ విషయంలో దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణను మెచ్చుకోవాలి. తొలి సినిమాకే కాస్త క్లిష్టంగా, కష్టంగా అనిపించే కథను సెలక్ట్ చేసుకున్న వెంకటేష్.. సెకండాఫ్ నుంచి తన రైటింగ్ పవర్ చూపించాడు. స్క్రీన్ ప్లేలో, ట్విస్టుల్లో చమక్కులు చూపించాడు. సినిమాలో ప్రేమ, భావోద్వేగం, యాక్షన్‌తో ఫన్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉండేలా జాగ్రత్తపడ్డాడు. దర్శకుడికి ఇది తొలి సినిమానే అయినప్పటికీ.. ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్‌గా డీల్‌ చేశాడు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం భీమ్స్ అందించిన సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, శంకర్ ఫైట్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే రామ్ అసుర్ సినిమా, టాలీవుడ్ ప్రేక్షకులకు ఓ కొత్త కథను పరిచయం చేస్తుంది.

Rating:  
(2.75/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top