సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు వెల్లడించారు. రేపు ఉదయమే ఆయనను డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. ఈమేరకు శనివారం సాయంత్రం రజనీకాంత్ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి బాగుందని అపోలో వైద్య బృందం తెలిపింది. ఆయనకు కొన్ని పరీక్షలు చేశామని, వాటి రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొంది. ఈ రోజు రాత్రి ఆయనను బీపీకి సంబంధించిన వైద్యులు పర్యవేక్షణలో ఉంచుతామని చెప్పింది.
కాగా 'అన్నాత్తే' సినిమా చిత్రీకరణలో భాగంగా రజనీకాంత్ ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 22న మొత్తం చిత్ర బృందానికి నిర్వహించిన కరోనా టెస్టుల్లో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రజనీ సహా ముఖ్య నటీనటులెవరికీ కరోనా సోకనప్పటికీ షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం రజనీకాంత్‌కు రక్తపోటు అధికం కావడంతో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో భయాందోళనకు గురైన ఆయన అభిమానులు రజనీ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేపట్టారు. మొత్తానికి వారి ప్రార్థనలు ఫలించి ఆయన ఆరోగ్యవంతుడై ఆదివారం డిశ్చార్జ్ అవనున్నట్లు కనిపిస్తోంది. (చదవండి: రజనీ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్.. అభిమానుల ఆందోళన)
(చదవండి: రజనీకాంత్‌కు తీవ్ర అస్వస్థత)


