'నిజమైన కరెన్సీ అదే'.. పూరి జగన్నాధ్‌ సందేశం విన్నారా? | Puri Jagannadh Gives Message about Time In our Life | Sakshi
Sakshi News home page

Puri Jagannadh: 'ఖర్చు చేయకపోయినా పర్సు ఖాళీ'.. పూరి సందేశమిదే..!

Apr 27 2026 5:46 PM | Updated on Apr 27 2026 5:50 PM

Puri Jagannadh Gives Message about Time In our Life

టాలీవుడ్ మాస్ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాస్ యాక్షన్‌ చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో జతకట్టారు. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది.

ఇక సినిమాల సంగతి పక్కనపెడితే పూరి జగనాధ్‌ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా లైఫ్‌ పాఠాలు చెబుతుంటారు. పూరి మ్యూజింగ్స్ పేరుతో తన అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా పూరి రిలీజ్‌ చేసిన వీడియో మన టైమ్, మనీ గురించి మాట్లాడారు. ప్రతి రోజు మనం ఖర్చు చేస్తున్న సమయం గురించి వివరించారు. లైఫ్‌లో డబ్బు మాత్రమే ఇంపార్టెంట్‌ కాదని సందేశమిచ్చారు. గడిచిపోయిన సమయాన్ని మాత్రం ఏం చేసినా తిరిగి తీసుకురాలేమని అన్నారు.  రియల్‌ కరెన్సీ పేరుతో పూరి ఏమన్నారో మీరు కూడా చదివేయండి.

'అందరికీ దేవుడు ఇచ్చింది రోజుకి 24 గంటలు మాత్రమే. ఎన్ని గంటలు ఉన్నాయన్నది కాదు.. ఆ 24 గంటలు ఎలా ఖర్చు చేశామన్నదే ముఖ్యం. మనం ప్రతి రోజు డబ్బు కోసం రాత్రి, పగలు కష్టపడతాం. ఆరోగ్యం పాడు చేసుకుంటాం. డబ్బు కంటే విలువైన సమయాన్ని మాత్రం పట్టించుకోం. టైం గురించి వివరంగా చెప్పాలంటే.. ప్రతి ఉదయం మన పర్సు టైంతో నిండిపోయి ఉంటుంది. రాత్రి అయ్యేసరికి నువ్వు ఏం చేసినా.. చేయకపోయినా ఖర్చు అయిపోతుంది. మళ్లీ ఉదయం చూసుకుంటే పర్సు నిండా 24 గంటలు నిండే ఉంటాయి'  అని అన్నారు.

'నువ్వు టైమ్‌ను వేస్ట్ చేసినా కరిగిపోతుంది.. తెలివిగా ఇన్వెస్ట్ చేసినా అయిపోతుంది. ఈ రెండింటిలో మనం ఏం చేస్తున్నామనేది చాలా ముఖ్యం. ఎన్నేళ్లు కష్టపడినా పర్లేదు.. ఏదో రోజు బోలెడంత డబ్బు సంపాదించి మిగిలిన జీవితమంతా హ్యాపీగా బతుకుదామనుకుంటాం. బాగా సంపాదించిన తర్వాత ఎంజాయ్‌ చేయడానికి టైముండదు. అందుకే అదే రియల్ కరెన్సీ. డబ్బు మాయలో పడి కుటుంబంతో గడిపే అరుదైన క్షణాలు కోల్పోతాం. మిత్రులతో గడిపే అందమైన సాయంత్రాలు మిస్ అవుతాం'

'ఒక రోజులో మన నాలుగు గంటలు ట్రాఫిక్.. మరో నాలుగు గంటలు చిరాకులో గడిచిపోతాయి. మిగతావి నిద్రకు కేటాయిస్తాం. ఈరోజు కాకపోతే రేపు గుడ్‌న్యూస్‌ వింటామని ఎదురు చూస్తూ నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇలా మన జీవితంలో ఎంత పోగొట్టుకున్నామో కరిగిపోయిన కాలమే సమాధానం చెబుతుంది. ఈ భూమ్మీద మనకి లిమిటెడ్ అవర్స్ ఉన్నాయి. వాటిని ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. ఎంత సంపాదించినా ఏదో ఒక రోజు ప్రాణం వదిలేస్తాం. అందుకే వీలైనన్ని మధుర క్షణాలు మన అకౌంట్‌లో పడితేనే పుట్టినందుకు.. ఇక్కడ గడిపినందుకు ఏదో ఓ మీనింగ్ అంటూ ఉంటుంది. లేకపోతే ఈ జర్నీ మొత్తం నాశనమైపోద్ది' అంటూ సమయం విలువను కరెన్సీతో పోలుస్తూ సందేశమిచ్చారు మన టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement