టాలీవుడ్ హీరోయిన్ తమన్నాకు మద్రాస్ హైకోర్ట్ షాకిచ్చింది. కోటి రూపాయల పరిహారం కోరుతూ హైకోర్ట్‌ను ఆశ్రయించగా.. ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. తన ఆరోపణలకు సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడంతోనే తమన్నా పిటిషన్ తిరస్కరిస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మిల్కీ బ్యూటీకి ఉన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది.
అసలేం జరిగిందంటే..
పవర్ సోప్స్ అనే సంస్థతో 2008లో తమన్నా ఒప్పందం చేసుకుంది. 2009 అక్టోబర్ వరకు మాత్రమే తమన్నాతో పవర్ సోప్స్‌కు అగ్రిమెంట్ కుదిరింది. కానీ గడువు ముగిసినా 2010, 2011లో కూడా ఆ సంస్థ తన ఉత్పత్తులతో పాటు ప్రకటనల్లో మిల్కీ బ్యూటీ ఫోటోలను వినియోగించింది. దీంతో ఒప్పందం అయిపోయినా కూడా తన ఫోటోలను ప్రకటనల్లో వాడారని ఆరోపిస్తూ తమన్నా ఇటీవలే మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా తమన్నా పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. సరైన ఆధారాలు లేకపోవడంతో తమన్నా పిటిషన్‌ను హైకోర్ట్ తిరస్కరించింది.


