‘ముదల్ పగుది’ (ఫస్ట్ పార్ట్) అదిరింది. అయితే ఆ కథ అక్కడితో ఆగలేదు. కొనసాగించే స్కోప్ ఉంది. అంతే... ‘ఇరండామ్ పగుది ఇరుక్కు’ (సెకండ్ పార్ట్ ఉంది) అంటూ సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ ఇరండామ్ పగుది రెండింతల మజానివ్వాలని ప్రేక్షకులకు, ఆయా చిత్రాల హీరోల అభిమానులకు ఉంటుంది కదా. అది దృష్టిలో పెట్టుకునే మరింత జాగ్రత్తగా సీక్వెల్ కథలను సిద్ధం చేసుకున్నారు దర్శకులు. 2026–2027లో తమిళ ‘వెండి తిరై’ (వెండి తెర) బోలెడన్ని సీక్వెల్స్ చూడబోతోంది. చెప్పాలంటే... కొన్ని సినిమాలకు సంబంధించిన ఫస్ట్ పార్ట్ తెలుగులోనూ విడుదలైంది. సో... ఇరండామ్ పగుది కూడా ఇక్కడ విడుదల కాకుండా ఉండదు. మరి... ఏయే సినిమాకి సీక్వెల్ రానుందో పడిక్కలాం (చదువుదాం) వాంగ (రండి).
మరింత యాక్షన్ డోస్‌తో...
టైగర్ ముత్తువేల్ పాండియన్ రాక కోసం అతని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ముత్తువేల్ పాత్రను రజనీకాంత్ అంత స్టైలిష్‌గా చేశారు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘జైలర్’ (2023)లో రజనీ పాత్ర పేరు ముత్తువేల్ పాండియన్ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. జాకీ ష్రాఫ్, మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్ వంటి స్టార్స్ అతిథులుగా నటించడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అయింది. ఇక జైలర్‌గా రజనీ తనదైన స్టైల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి భాగం కన్నా మలి భాగంలో ముత్తువేల్ పాండియన్ పాత్రకు మరింత యాక్షన్ డోస్ పెంచి, రజనీని మరింత స్టైలిష్‌గా చూపించనున్నారు నెల్సన్.
ఈ సీక్వెల్ కథ అంతర్జాతీయ క్రైమ్ నెట్ వర్క్ నేపథ్యంలో సాగుతుందని, ముత్తువేల్ పాండియన్ గతాన్ని కూడా చూపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ‘జైలర్ 2’లోనూ మోహనల్ లాల్, శివ రాజ్‌కుమార్ కనిపించనున్నారు. విజయ్ సేతుపతి కూడా అతిథి పాత్ర చేశారు. అదనపు ఆకర్షణగా షారుక్ ఖాన్ కనిపిస్తారనే వార్త ప్రచారంలో ఉంది. విద్యా బాలన్, మిథుర్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించారు. సీక్వెల్‌ని మరింత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది సన్ పిక్చర్స్. జూన్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారన్నది ప్రస్తుత సమాచారం. తొలి భాగంలానే మలి భాగం కూడా అదే టైటిల్‌తో తెలుగులో విడుదల కానుంది.
త్వరలో సెట్స్‌కి కంగువ 2
గతం, వర్తమానం... ఇలా రెండు టైమ్‌లైన్స్‌లో సాగే చిత్రంగా ‘కంగువ’ (2024) ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో ఈ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ రూపొందింది. ఈ చిత్రంలో కంగువాగా, ఫ్రాన్సిస్ థియోడోర్‌గా డ్యుయల్ రోల్‌లో కనిపించి, ఆకట్టుకున్నారు సూర్య. ‘కంగువ’ విడుదల సమయంలోనే సెకండ్ పార్ట్ ఉంటుందని చిత్రనిర్మాత జ్ఞానవేల్ రాజా స్పష్టం చేశారు. సీక్వెల్ కథ కూడా సిద్ధమైంది. గత ఏడాది చివర్లోనే క్లాప్ కొట్టి, చిత్రాన్ని ఆరంభిస్తారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవం జరగలేదు. త్వరలో చిత్రీకరణ ఆరంభిస్తారని సమాచారం. వచ్చే ఏడాది విడుదల చేయాలన్నది టీమ్ ప్లాన్. ఇదిలా ఉంటే... తొలి భాగం చివర్లో కార్తీ పాత్ర పరిచయం అవుతుంది. దాంతో ఈ సీక్వెల్ సూర్య, కార్తీ మధ్య సాగే భారీ యాక్షన్ మూవీగా ఉంటుందనే ఊహాగానాలు నెలకొన్నాయి. తమిళ, తెలుగులో భాషల్లో తొలి భాగం విడుదలైనట్లుగానే ‘కంగువ 2’గా ఈ రెండు భాషల్లో విడుదలవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
త్వరలో సర్దార్ 2... 2027లో సెట్స్‌కి డిల్లీ
ఒకటి కాదు... రెండు సీక్వెల్స్‌లో కనిపించనున్నారు కార్తీ. ఒకటి ఆల్రెడీ విడుదలకు సిద్ధంగా ఉంది అదే ‘సర్దార్ 2’. మరొకటి ‘ఖైదీ 2’. ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కావాల్సి ఉంది.
సర్దార్ ఎప్పుడు వస్తాడు?
కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘సర్దార్’ (2022) సూపర్ హిట్ అయింది. ఈ స్పై థ్రిల్లర్ మూవీకి సీక్వెల్‌గా ఇదే కాంబినేషన్‌లో ‘సర్దార్ 2’ రూపొందిన. నిజానికి ఈ చిత్రం షూటింగ్ గత ఏడాది జూన్‌లో పూర్తయింది. డిసెంబరులో విడుదలవుతుందని చాలామంది ఊహించారు. కానీ, అది జరగలేదు. చివరికి ఈ ‘సర్దార్’ సమ్మర్‌కి వస్తాడనే టాక్ ప్రచారంలో ఉంది. అయితే ఏ తేదీకి వస్తాడు? అనే విషయం గురించి చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. తొలి బాగంలో ఏజెంట్ సర్దార్, ఇన్‌స్పెక్టర్ విజయ్ ప్రకాశ్‌గా డ్యుయల్ రోల్ చేసిన కార్తీ మలి భాగంలోనూ ఈ రెండు పాత్రల్లో కనిపిస్తారు.
కాగా ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్‌లో యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుందని సమాచారం. తొలి భాగం మంచి టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో మలి భాగంపై భారీ అంచనాలు ఉన్నాయి. కార్తీ ఫ్యాన్స్ ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం విడుదల కానుంది.

రెండింతల యాక్షన్... ఎమోషన్
డిల్లీ అంటే ఎవరో ‘ఖైదీ’ (2019) సినిమా చూసినవాళ్లకి తెలుసు. ఆ సినిమాలో హీరో కార్తీ పాత్ర పేరు డిల్లీ. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ మూవీ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీకి సీక్వెల్ చేసే ఆలోచన ఉందని లోకేశ్ గతంలో పేర్కొన్నారు. అయితే ఇంకా పట్టాలెక్కకపోవడంతో ‘ఖైదీ 2’ లేదని చాలామంది ఫిక్స్ అయిపోయారు. మఖ్యంగా డిల్లీ పాత్రను చాలా ఇష్టపడిన కార్తీ అభిమానులను ఈ సీక్వెల్ ఆగిందనే వార్తలు నిరాశకు గురి చేశాయి. నిజానికి ఈ సినిమా ఆగిందని ప్రచారం జరగడానికి కారణం అల్లు అర్జున్ హీరోగా సినిమా చేయడానికి లోకేశ్ కనగరాజ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే. అయితే ‘ఖైదీ 2’ ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లోకేశ్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది డిల్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
‘ఖైదీ’ సినిమా చివర్లో డిల్లీ తన కూతురు అముదిని కలుసుకోవడానికి బయలుదేరుతాడు. తన కూతురితో కొత్త జీవితం ్ర΄ారంభించాలనుకుంటాడు. కానీ అతను జైలులో ఉన్నప్పుడు పని చేసిన డ్రగ్ మాఫియా గ్యాంగ్ పూర్తిగా నాశనం కాదు. ఆ గ్యాంగ్‌లో మిగిలిన సభ్యులు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయిస్తారు. ‘ఖైదీ 2’ కథ అక్కడి నుంచే ప్రారంభమవుతుందని సమాచారం. ఫస్ట్ పార్ట్‌తో పోల్చితే సీక్వెల్ రెండింతల యాక్షన్, ఎమోషన్‌తో ఉండేలా లోకేశ్ ΄ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ అంటోంది. కార్తీ అన్ని సినిమాలూ తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతాయి కాబట్టి ‘ఖైదీ 2’ కూడా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తుంది.

మరోసారి అమ్మవారిగా...
నయనతార కథానాయికగా ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఫ్యాంటసీ కామెడీ మూవీ ‘మూకుత్తి అమ్మన్’ (2020). దర్శకుడిగా బాలాజీకి ఇది తొలి చిత్రం. ఈ చిత్రంలో నయనతార అమ్మవారి పాత్ర పోషించారు. తాజాగా ‘మూకుత్తి అమ్మన్ 2’ రూపొందింది. రెండో భాగంలోనూ నయనతార కథానాయికగా నటించారు. అయితే దర్శకుడు మారారు. రెండో భాగాన్ని దర్శకుడు సుందర్. సి తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఖుష్బూ, స్నేహ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఊర్వశి, రెజీనా కసాండ్రా, సునీల్, యోగిబాబు, అభినయ తదితరులు నటించారు. ఇటీవలే ‘మూకుత్తి అమ్మన్ 2’ షూటింగ్ పూర్తయింది. తొలి భాగం ‘అమ్మోరు తల్లి’ టైటిల్‌తో తెలుగులో విడుదలైంది. రెండో భాగం కూడా విడుదల కానుంది. ఈ ఏడాదే ఈ సీక్వెల్ సిల్వర్ స్క్రీన్‌కి వస్తుంది. అయితే ఇంకా విడుదల తేదీ ఫిక్స్ కాలేదు.

మళ్లీ బాక్సింగ్ రెడీ
బాక్సింగ్ నేపథ్యంలో ఆర్య హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సార్పట్ట పరంపర’ (2021). ఈ చిత్రం అదే పేరుతో తెలుగులోనూ విడుదలైంది. తమిళనాడులోని అట్టడుగు వర్గాలు నివాసం ఉండే ప్రాంతం నేపథ్యంలో ఈ స్పోర్ట్స్ డ్రామాని రూపొందించారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడే సీక్వెల్ ప్రకటించారు. ఈ జూన్‌లో సీక్వెల్ షూటింగ్‌ని ప్రారంభిస్తామని తాజాగా ఆర్య స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే... పా.రంజిత్ దర్శకత్వంలోనే ఆర్య హీరోగా ఆరంభమైన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘వెట్టువమ్’ షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ్ల ఓ లీడ్ రోల్‌లో కనిపిస్తారు. ఈ ఏడాదే ‘వెట్టువమ్’ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక ఈ సినిమా పనులు ఒక కొలిక్కి రావడంతో ‘సార్పట్ట పరంపర 2’ షూటింగ్‌ని జూన్‌లో ఆరంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.
‘తని ఒరువన్ 2’ ఆగదు
‘జయం’ రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘తని ఒరువన్’ (2015). ఈ చిత్రకథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్, ‘జయం’ రవి పర్ఫార్మెన్స్... ఇలా అన్నింటికీ ప్రశంసలు దక్కాయి. వసూళ్ల పరంగా కూడా భేష్ అనిపించుకుంది. ఈ చిత్రం తెలుగులో రామ్‌చరణ్ హీరోగా ‘ధ్రువ’ పేరుతో రీమేక్ అయింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘తని ఒరువన్’కి సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు. అయితే పదేళ్లయినా సీక్వెల్ ఇంకా పట్టాలెక్కక΄ోవడంతో రెండో భాగం లేదని చాలామంది ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సినిమా ఆగలేదని, గత ఏడాది సెప్టెంబర్‌లో త్వరలో ఈ సినిమా గురించి అప్‌డేట్ ఇస్తామని మోహన్ రాజా పేర్కొన్నారు. ఆ తర్వాత వేరే న్యూస్ ఏదీ రాలేదు. నిర్మాణంలో జాప్యం జరుగుతుందే కానీ సీక్వెల్ నిర్మించాలనే ఆలోచనను యూనిట్ విరమించుకోలేదని కోలీవుడ్ టాక్.

కుస్తీకి రెడీ
విష్ణు విశాల్ హీరోగా రెజ్లింగ్ నేపథ్యంలో చెల్లా అయ్యవు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గట్ట కుస్తీ’ (2022). ‘మట్టి కుస్తీ’గా తెలుగులో విడుదలైంది. మరోసారి ఈ హీరో–దర్శకుడు వెండితెరపై కుస్తీ చూపించడానికి రెడీ అయ్యారు. ‘గట్ట కుస్తీ 2’ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.
నీలాంబరి రిటర్న్స్
రజనీకాంత్ హీరోగా నటించిన ‘పడయప్పా’ (1999 – తెలుగులో ‘నరసింహా’) లో నీలాంబరిగా రమ్యకృష్ణ కనబర్చిన నటనను అంత సులువుగా మరచిపోలేం. ఈ సినిమా విడుదలై పాతికేళ్లు అవుతోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. కాగా, ఈ చిత్రానికి సీక్వెల్ వచ్చే అవకాశం ఉంది. రెండో భాగానికి రజనీకాంత్ కథ రాస్తున్నారని ఆయన రెండో కుమార్తె సౌందర్య పేర్కొన్నారు. కానీ ఎవరు నటిస్తారు? దర్శకత్వం వహిస్తారు వంటి విషయాలు తెలియజేయడానికి ఇది ‘టూ ఎర్లీ’ అవుతుందని కూడా ఆమె పేర్కొన్నారు. కథ పూర్తయ్యాక ఆ వివరాలను తెలియజేస్తారు. అయితే టైటిల్ మాత్రం ‘నీలాంబరి’ అనుకుంటున్నారట.
మరగద నాణ్యం 2
‘మరకతమణి’గా విడుదలైంది. ఈ ఫ్యాంటసీ కామెడీ మూవీకి సీక్వెల్‌గా ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘మరగద నాణ్యం 2’ని ఆరంభించారు. ఆది పినిశెట్టి హీరోగా, నిక్కీ గల్రానీ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా ఏఆర్‌కే శరవణన్ దర్శకత్వంలోనే రెండో భాగం రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్ లానే సీక్వెల్ కూడా ఫ్యాంటసీ కామెడీ నేపథ్యంలోనే సాగుతుంది. కాగా పెళ్లి చేసుకున్న తర్వాత ఆది, నిక్కీ జంటగా నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఈ ఇద్దరూ 2022లో పెద్దల సమ్మతంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. తెలుగులోనూ విడుదలవుతుంది.


