రణ్‌బీర్ కపూర్ నటించిన ‘రామాయణ’ టీజర్‌పై షోషల్‌మీడియాలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా విడుదలైన టీజర్‌లో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఆశించినంత రేంజ్‌లో లేవని చిత్ర దర్శకుడు నితీశ్ తివారీపై కామెంట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందనలను ఎదుర్కొంటున్న తరుణంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ స్పందించారు. విజువల్ ఎఫెక్ట్స్‌పై తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వివరణాత్మక నోట్‌ను పంచుకున్నారు. ఆయన ఏ సినిమా పేరు ప్రస్తావించనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు చేసిన సమయం మాత్రం ప్రస్తుతం జరుగుతున్న చర్చలో భాగంగానే నిలుస్తోంది.
నాసిరకం విఎఫ్ఎక్స్ (VFX) ఉన్నాయని హృతిక్ అంగీకరించినప్పటికీ, విజువల్స్‌ను కేవలం వాస్తవికత ఆధారంగానే అంచనా వేయకూడదని స్పష్టం చేశారు. సినిమాలు, ముఖ్యంగా ఫాంటసీ, పౌరాణిక చిత్రాలు, వాస్తవికతను ప్రతిబింబించేలా మాత్రమే విజువల్స్ ఉంటాయని పేర్కొన్నారు. వీఎఫ్ఎక్స్ అంటే కేవలం వాస్తవానికి దగ్గరగా ఉండటమే కాదంటూనే.. ఒక్కో దర్శకుడు ఒక్కో శైలిని ఎంచుకుంటారని క్లారిటీ ఇచ్చారు. కొన్నిసార్లు అది ‘స్టోరీ బుక్’ తరహాలో కూడా ఉండవచ్చిని పేర్కొన్నారు.
ఇలాంటి ప్రాజెక్టుల వెనుక ఉండే కృషి స్థాయిని కూడా హృతిక్ రోషన్ నొక్కిచెప్పారు. విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉండే చిత్రాల కోసం సంవత్సరాల తరబడి మేకర్స్ పనిచేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ప్రేక్షకుల అభిప్రాయాన్ని కొట్టిపారేయకుండా వారి అంచనాలకు మించి విఎఫ్‌ఎక్స్ ఉండాలని సూచించారు.
కల్కి 2898 AD, బాహుబలి, రామాయణ వంటి భారీ సినిమాలు నిర్మించిన వారు అసలైన హీరోలని ప్రశంసించారు. గతంలో ఎవరూ చేయలేని సాహసాన్ని చేస్తున్నారని గుర్తుచేశారు. రామాయణ సినిమాలోని వీఎఫ్ఎక్స్ వీడియో గేమ్ లాగా ఉన్నాయన్న విమర్శలపై హృతిక్ టెక్నికల్‌గా సమాధానమిచ్చారు.


