కల్వకుర్తి రూరల్: నాగర్‌కర్నూల్ మెడికల్ కళాశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్వకుర్తి మండలంలోని ఎల్లికల్ గ్రామానికి చెందిన దాదా మోని బాలకృష్ణ (21) అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. బాలకృష్ణ తండ్రి చంద్రయ్య వీఆర్వోగా తెలకపల్లి మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో కుటుంబమంతా తెలకపల్లిలో నివాసముంటున్నారు. మృతుడు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఒక హోటల్‌లో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తూ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వచ్చిన కారును వేగంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఎల్లికల్ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతుడికి ఇద్దరు సోదరీమణులు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
అనుమానాస్పద స్థితిలో..
మక్తల్: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మక్తల్‌కు చెందిన రాఘవేందర్‌రెడ్డి (30), తన అన్నకు మధ్య భూతగాదాలు ఉన్నా యి. ఈ క్రమంలో రాఘవేందర్‌రెడ్డి మృతి చెందడంలో అన్న వదినల ప్రమేయం ఉంద ని అనుమానం వ్యక్తం చేస్తూ.. మృతుడి అక్క నర్వకు చెందిన తిలేటి శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై పూర్తి విచారణ చేపట్టి, మృతికి గల కారణాలు తెలుసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.
పిడుగు పాటుకు
పశువులు మృతి
పెద్దకొత్తపల్లి: మండలంలోని మరికల్‌లో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగుపాటుతో దేవరపాగా జపాన్ తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న నాలుగు పశువులు మృతిచెందాయి. పశువుల విలువ దాదాపుగా రూ.1.50లక్షలు ఉంటుందని రైతు తెలిపారు. వ్యవసాయ పొలం పనులు చేసే పశువులు మృతి చెందడంతో రైతు కుటుంబం బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనపై సర్పంచ్ రాముడు, వార్డుసభ్యుడు ఈశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతిచెందిన పశువులను పరిశీలించారు. ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం చేసి రైతును ఆదుకోవాలని వారు కోరారు.
రోడ్డు ప్రమాదంలో
లారీ డ్రైవర్ మృతి
వనపర్తి రూరల్: జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ మృతిచెందిన ఘటన ఆదివారం పెబ్బేరు మండలం రంగాపురం సమీపంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకటేష్‌గౌడ్ కథనం ప్రకారం.. జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్ వినోద్‌కుమార్‌పాల్ (46) తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం 108లో వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.
హత్య ఘటనపై
కేసు నమోదు
గోపాల్‌పేట: వుండల కేంద్రంలో శనివారం ఉదయం గొర్రెల కాపరిపై కొందరు దాడిచేసి, హత్య చేసిన ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేశామని గోపాల్‌పేట ఎస్‌ఐ శశిధర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఏదుల మండలంలోని మాచుపల్లికి చెందిన బూత్కూరి బాల్‌చంద్రి (50) గొర్రెల కాపరిగా మండల కేంద్రానికి చెందిన లక్ష్మి వద్ద జీతం కుదుర్చుకున్నాడు. వారి మంద వెంట తిరిగే మరో మందకు చెందిన మల్లేష్, ఆయన తల్లి నీలమ్మ, భార్య సుమతి వారి గొర్రెల కాపరిగా పనిచేయాలని కోరగా.. బాల్‌చంద్రి ఒప్పుకోలేదు. ఇది మనసులో పెట్టుకోవడంతో పాటు అప్పుడప్పుడు గొర్రెల దొంగతనం చేసే మల్లేష్ గురించి బయట చెబుతాడనే అనుమానంతో శనివారం ఉదయం గోపాల్‌పేట, చెన్నూరు శివారులో గొర్రెలు మేపుతున్న బాల్‌చంద్రి వద్దకు మల్లేష్, సుమతి, నీలమ్మ ముగ్గు రూ కలిసి కట్టెలతో కొట్టారు. అనంతరం మల్లే్ ష తన వెంట తెచ్చుకున్న కటింగ్ ప్లేయర్‌తో బాల్‌చంద్రి మర్మాంగాలపై దాడి చేశారు. దీంతో బాధితుడు అక్కడికక్కడే మరణించాడు. మృతుడి భార్య బూత్కూరి వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఎస్‌ఐ వివరించారు.


