●
ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో సమకూరని వసతులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలు సోమవారం తెరుచుకోనున్నాయి. 45 రోజులపాటు వేసవి సెలవులు గడిపిన విద్యార్థులు ఇక పాఠశాలల బాట పట్టనున్నారు. అయితే మరో విద్యా సంవత్సరం 2026– 27 ప్రారంభమవుతున్నా.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం వసతులు, సౌకర్యాలు మెరుగుపడటం లేదు. జిల్లావ్యాప్తంగా మొత్తం 851 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. వీటిలో ప్రాథమిక 616, ప్రాథమికోన్నత 83, ఉన్నత పాఠశాలలు 152 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో సుమారు 72 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే 2023– 24 విద్యా సంవత్సరంలో బడిబాట కార్యక్రమం ద్వారా తరగతి గదులు, మరుగుదొడ్లు వంటివి నిర్మించినా.. ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు వాటిని అప్పగించకుండా తాళాలు వేశారు.
బహుభాష బోధనా సమస్యే..
ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో తెలుగు మీడియంలో ఎక్కువగా బోధన జరుగుతుండగా.. గత ఐదేళ్ల నుంచి ఇంగ్లిష్ మీడియం సైతం ప్రవేశపెట్టారు. వీటికి తోడు కొన్ని పాఠశాలల్లో ఉర్దూ మీడియం కూడా బోధిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని మాడ్రన్ బేసిక్ పాఠశాలలో 1వ తరగతి నుంచి 7 వరకు తరగతులు ఉండగా ఇందులో తెలుగు, ఇంగ్లిష్‌తోపాటు ఉర్దూ మీడియం విద్యార్థులు చదువుతున్నారు. మూడు భాషలలో కలిపి సుమారు 190 మందికిపైగా విద్యార్థులు ఉండగా.. తరగతి గదులు మాత్రం 6 ఉన్నాయి. దీంతో ఒకే గదిలో పలు తరగతుల విద్యార్థులకు బోధిస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయుల కొరత సైతం వేధిస్తోంది.
తరగతి గదులు, మరుగుదొడ్లు,
ఇతర సౌకర్యాలు లేక ఇక్కట్లు
ఇంగ్లిష్, తెలుగు మీడియంతో
తీవ్రమైన గదుల కొరత
జిల్లాలో 851 పాఠశాలలు,
72 వేల మంది విద్యార్థులు
నేటినుంచి పునఃప్రారంభం కానున్న విద్యాసంస్థలు


