ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా..
డీపీఆర్ పూర్తయింది..
అచ్చంపేట: శ్రీశైలం క్షేత్రానికి వెళ్లాలంటే నల్లమల ఘాట్ రోడ్డు ఒక్కటే మార్గం. అందులో అనేక మలుపులు, ఎత్తుపల్లాలు ఉంటాయి. దీనికితోడు ఘాట్ రోడ్డులో రాత్రిళ్లు ప్రయాణం నిషిద్ధం. ఈ నేపథ్యంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా ప్రతిపాదన దశలోనే ఉండగా.. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని విన్నవించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం సైతం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఈ కారిడార్ పూర్తయితే బ్రాహ్మణపల్లి (మన్ననూర్)– శ్రీశైలం, పెద్దదోర్నాల– శ్రీశైలం మార్గాల మధ్య దూరం తగ్గి.. రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.
ఎక్కడి నుంచి ఎక్కడికి..
తెలంగాణ వైపు బ్రాహ్మణపల్లి నుంచి శ్రీశైలం వరకు 45.35 కి.మీ., ఏపీలోని పెద్ద దోర్నాల నుంచి శ్రీశైలం వరకు 41.39 కి.మీ.,తో కలిపి మొత్తం 86.74 కి.మీ. ఎత్తైన కారిడార్ నిర్మించనున్నారు. శ్రీశైలం ఆలయ సమీపం నుంచి వెళ్లేలా మార్పులతో కూడిన డీపీఆర్ ప్రతిపాదనలు కేంద్రానికి పంపించారు. ఇందుకు రూ.18,500 కోట్ల నిధులు అవసరం కాగా.. కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2025 మార్చి 2న సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పూర్తయింది. అలాగే ఈ ప్రాజెక్టులో భాగంగా ఈగలపెంట– సున్నిపెంటల (లింగాలగట్టు) మధ్య తెలంగాణ– ఏపీలను అనుసంధానిస్తూ.. కృష్ణానదిపై రూ.300 కోట్లతో ఐకానిక్ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
జాతీయ వన్యప్రాణి బోర్డు అనుమతుల కోసం..
ఈ ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అధ్యయనం కోసం భారత వన్యప్రాణి సంస్థ సహాయం తీసుకుంటున్నారు. వారి నివేదిక ఆధారంగా జాతీయ వన్యప్రాణి మండలి అనుమతులు పొంది.. త్వరలోనే పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్కడి నుంచి అనుమతులు వస్తే.. కారిడార్ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. నల్లమల అభయారణ్యం ప్రాంతం కావడంతో వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 32 అడుగుల ఎత్తులో కారిడార్ నిర్మించనున్నారు.
నిత్యం వెయ్యికిపైగా వాహనాలు..
హైదరాబాద్ నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం నిత్యం వెయ్యికిపైగా వాహనాలు వస్తుంటాయి. శని, ఆది, సోమవారాల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోతుంది. గత ఏప్రిల్ 24న కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఈ రహదారి మీదుగా శ్రీశైలం వెళ్తూ.. వాహనదారులు పడుతున్న అవస్థలను ప్రత్యక్షంగా చూశారు. ఈ క్రమంలోనే ఎలివేటెడ్ కారిడార్ మంజూరుకు సహకరిస్తామని చెప్పినట్లు తెలిసింది.
భూ సేకరణే కీలకం..
ఎలివేటెడ్ కారిడార్ స్తంభాల ఆధారంగా నిర్మించడం వల్ల అటవీ భూమి వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. నల్లమలలో కారిడార్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కీలకంగా మారింది. బ్రాహ్మణపల్లి నుంచి మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట, పాతాళగంగ వరకు 147.31 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉండగా.. 128.63 హెక్టార్ల భూమి అటవీశాఖ పరిధిలోనే ఉంది. 18.68 హెక్టార్ల భూమి మాత్రమే పట్టాదారుల నుంచి సేకరించాల్సి ఉంది.
ఈ మార్గంలో అనేక మూల మలుపులు, ఘాట్ రోడ్డు ఉండటంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శ్రీశైలం దైవ దర్శనం కోసం వచ్చి రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నెల 7న కృష్ణగిరి (ఈగలపెంట) సమీపంలో మలుపు వద్ద ఓ ప్రైవేటు టూరిస్టు బస్సు రోడ్డు పక్కనున్న గోతిలో కూరుకుపోవడంతో 10 కి.మీ., మేర వాహనాలు నిలిచిపోయాయి. అటవీశాఖ సహకారంతో హైటికోస్ స్వచ్ఛంద సంస్థ శ్రీశైలం ప్రధాన రహదారిలో 2024 జూలై నుంచి 2025 జూన్ మధ్యకాలంలో ప్రమాదాలపై సర్వే నిర్వహించింది. ఏడాదిలో 51 రకాలకు చెందిన 456 వన్యప్రాణులు మృతిచెందినట్లు తేలింది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు కారిడార్ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు.
ఎలివేటెడ్ కారిడార్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్మించే కారిడార్ సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) పూర్తయింది. కేంద్రం జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు అనుమతుల కోసం నివేదిక పంపాం. బోర్డు అనుమతులు వస్తే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. అనుమతుల కోసం ఎంపీల బృందం కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీని కలిసి ప్రతిపాదనలు అందజేయగా సానుకూలంగా స్పందించారు.
– వంశీకృష్ణ, ఎమ్మెల్యే,
వన్యప్రాణి సంరక్షణ బోర్డు సభ్యుడు
రూ.18,500 కోట్లతో
కేంద్రానికి ప్రతిపాదనలు
తాజాగా ప్రధాని మోదీని
కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి
కారిడార్ నిర్మాణంతో
బ్రాహ్మణపల్లి– శ్రీశైలం,
పెద్దదోర్నాల– శ్రీశైలం మధ్య
రవాణా సౌకర్యం మెరుగు
మరోవైపు ఏపీ ప్రభుత్వం సైతం కేంద్రంపై ఒత్తిడి


