కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టాలి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టాలి

Jun 15 2026 12:53 AM | Updated on Jun 15 2026 12:53 AM

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లా

నేతలతో హైదరాబాద్‌లో సమీక్ష

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. చివరలో మిగిలిన పాలమూరు ప్రాజెక్టు పనులు చేపట్టకుండా.. రైతులకు సాగునీరు అందించకుండా ద్రోహం చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో ఆదివారం ఆయన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులపై సుదీర్ఘంగా సమీక్షించారు. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమావేశాలు, నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యక్రమాల తీరుపై నేతల వద్ద ఆరా తీశారు. త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ఓటర్ల జాబితా సవరణ, పార్టీ చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో భారీగా ఆదరణ పెరిగిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిఒక్కరూ గుర్తించారని, ఆ పార్టీ అన్నివర్గాలకు చేస్తున్న మోసం పట్ల తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారని జిల్లా నాయకులు కేటీఆర్‌కు వివరించినట్లు తెలిసింది. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో బూత్‌ల వారీగా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో ఉన్న సానుకూలతను పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలని.. ఆ దిశగా కలిసికట్టుగా.. పక్కా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌, అంజయ్యయాదవ్‌, చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement