పాలమూరు రెడ్‌క్రాస్‌కు మొదటి బహుమతి | - | Sakshi
Sakshi News home page

పాలమూరు రెడ్‌క్రాస్‌కు మొదటి బహుమతి

Jun 15 2026 12:53 AM | Updated on Jun 15 2026 12:53 AM

పాలమూరు: రాష్ట్రంలో అత్యధికంగా 7323 యూనిట్ల రక్త నిల్వలు సేకరించి మొదటి స్థానంలో నిలిచిన మహబూబ్‌నగర్‌ ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ రక్తనిధి కేంద్రానికి ఆదివారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా చేతులమీదుగా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ నటరాజ్‌ బహుమతి అందుకున్నారు. 2025– 26 సంవత్సరంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు, రక్తమార్పిడి సేవలలో విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందించారు. గత 24 ఏళ్లుగా రక్త సేకరణలో మహబూబ్‌నగర్‌ రెడ్‌క్రాస్‌ రక్తనిధి కేంద్రం అగ్రస్థానంలో నిలుస్తుందని నటరాజ్‌ వెల్లడించారు.

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): జిల్లాలోని నిరుద్యోగ యువతకు అమర్‌రాజా ఈఎస్‌ఎస్‌సీఐ ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ సెంటర్‌ మేనేజర్‌ ఆనంద్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకనటలో తెలిపారు. ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ సర్వీస్‌, ఏసీ టెక్నీషియన్‌ రంగాల్లో 90 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనునట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం సెల్‌ నంబర్లు 73034 44397, 73034 44561లను సంప్రదించాలని సూచించారు.

రాజీ కేసుల సంఖ్య పెరగాలి

మహబూబ్‌నగర్‌ క్రైం: ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో కక్ష్యిదారులు అధిక సంఖ్యలో హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డి.జానకి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. లోక్‌ అదాలత్‌లో తక్కువ ఖర్చుతో సత్వర న్యాయం లభిస్తుందన్నారు. న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న వివిధ కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవడానికి ఇది చక్కని వేదిక అన్నారు. ట్రాఫిక్‌ చలానాలు, క్రిమినల్‌ కేసులు, సివిల్‌ వివాదాలు, రాజీకి అనుకూలంగా ఉన్న ఇతర కేసులను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌ నుంచి రాజీ చేసుకోవడానికి వీలున్న ప్రతి కక్షిదారుడు లోక్‌ అదాలత్‌కు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోర్టు డ్యూటీ పోలీస్‌ సిబ్బందికి సూచించారు.

మార్కెట్‌కు తగ్గిన

వరి ధాన్యం రాక

నవాబుపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు నెల రోజులపాటు భారీగా వచ్చిన వరిధాన్యం ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. గత వారం వరకు 15 వేల బస్తాలకు తగ్గకుండా ప్రతి ఆదివారం ధాన్యం వచ్చేది. కాగా ఈసారి కేవలం 4,882 బస్తాల ధాన్యం మాత్రమే వచ్చింది. అయితే ధాన్యం క్వింటాల్‌ గరిష్టంగా రూ.2,912, కనిష్టంగా రూ.2,892 ధర లభించిందని మార్కెట్‌ అధికారి రమేష్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement