వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Jun 15 2026 12:53 AM | Updated on Jun 15 2026 12:53 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): జిల్లాలో కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌ నుంచి అధికారులతో ఆయన వీసీ నిర్వహించి.. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. మండల స్థాయిలో లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు సోమవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని, గతేడాది ఎదురైన సవాళ్లను ముందుగానే పరిష్కరించుకునేలా అప్రమత్తం కావాలన్నారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి గ్రామ స్థాయిలో టాం టాం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని, తహసీల్దార్‌, ఎంపీడీఓలు గ్రామాల్లో గజ ఈతగాళ్లు ఎంతమంది ఉన్నారో వారి పేర్లు, సెల్‌ నంబర్లు సేకరించాలని, ఎక్కడైనా ఏదైనా అనుకోకుండా సంఘటన జరిగితే తక్షణమే వారి సహాయం తీసుకొని ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో రోడ్ల మీద వర్షపు నీరు పారకుండా చూసుకోవాలన్నారు. గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలు, వైర్లు ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులు గ్రామాల్లో పర్యటించి పరిష్కరించేలా బాధ్యత వహించాలన్నారు. సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నందున, పరిసరాలను ఎంపీడీలు పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయించాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని, గ్రామస్థాయి నుంచి ఏమైనా సమాచారం వస్తే వాటిని మండల, డివిజన్‌ స్థాయి అధికారులకు చేరవేసి సమస్య పరిష్కరించేలా చూడాలన్నారు. మండల స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement