పాముకాటుతోరైతు మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతోరైతు మృతి

Jun 14 2026 10:01 AM | Updated on Jun 14 2026 10:01 AM

పెద్దకొత్తపల్లి: మండలంలోని చంద్రబండ తండాకు చెందిన రైతు కేతావత్‌ శంకర్‌నాయక్‌ (47)ను శనివారం పాముకాటు వేయడంతో మృతి చెందాడు. తండావాసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం తన పొలంలో పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే కొల్లాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఇంటి యజమాని అకాల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుని భార్య మంగమ్మ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబాన్ని సర్పంచ్‌ చిట్టిశకంర్‌నాయక్‌, ఉప సర్పంచ్‌ శంకర్‌నాయక్‌ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

నవాబుపేట: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని కూచూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కూచూర్‌కు చెందిన కర్రె ప్రభాకర్‌ (34) లారీ నడుపుతూ జీవనం సాగించేవాడు. లంబాడి కులానికి చెందిన పద్మమ్మ అనే మహిళను నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. కాగా వీరికి సంతానం కలగలేదు. ఈ క్రమంలో ప్రభాకర్‌ మరో మహిళతో సహజీవనం చేస్తుండటంతో గొడవలు జరిగి భార్యతో విడాకులు తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం కలిసి ఉంటున్న మహిళతో కూడా గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన ప్రభాకర్‌ శనివారం గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి కర్రె ఎల్లయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేందర్‌ తెలిపారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

అడ్డాకుల: మూసాపేట మండలం వేములలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందిన ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. బాధితుల కథనంం ప్రకారం.. గ్రామానికి చెందిన హరిజన్‌ రాములు(58) శనివారం మధ్యాహ్నం ఇంటి వద్ద కరెంట్‌ మోటర్‌ ఆన్‌ చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కరెంట్‌ షాక్‌కు గురై కింద పడిపోయాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు జానంపేట పీహెచ్‌సీకి తీసుకెళ్లి అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రాములును పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్లు ధృవీకరించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యుల రోధనలు కలచి వేశాయి. మృతుడికి భార్య నాగమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాములు మృతితో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ఇంటిపై తాటిచెట్టు కూలి వృద్ధురాలు మృతి

మరో ఇద్దరికి గాయాలు

మీర్‌పేట: ఈదురు గాలులకు తాటిచెట్టు కూలి ఇంటిపై పడడంతో ఓ వృద్ధురాలు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజశేఖర్‌ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా, లింగాల మండలం షాన్‌పేటకు చెందిన సభావత్‌ లక్ష్మీసేవ్య ఇద్దరు కుమారులు, కోడలుతో కలిసి కొంత కాలంగా జిల్లెలగూడ రాఘవేంద్రనగర్‌ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు బలమైన ఈదురు గాలులు వీయడంతో వెనకాల ఉన్న తాటిచెట్టు విరిగి ఇంటిపై పడింది. దీంతో పైకప్పు రేకులు విరిగి నిద్రిస్తున్న లక్ష్మి(75), కుమారుడు వెంకట్రాం, కోడలు లలితపై పడ్డాయి. వెంటనే స్పందించిన స్థానికులు చెట్టుతో పాటు రేకులు, శిథిలాలను తొలగించి, క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, తీవ్రగాయాలైన లక్ష్మి చనిపోయింది. కొడుకు, కోడలు చికిత్స పొందుతున్నారు. పని నిమిత్తం ఇతర గ్రామానికి వెళ్లిన చిన్నకొడుకు రమేశ్‌కు ప్రమాదం తప్పింది. రమేశ్‌ ఫిర్యాదు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు.

తొమ్మిది మందిపై పోక్సో కేసు నమోదు

అమరచింత: మండలంలోని ఓ గ్రామంలో మైనర్‌ను ప్రేమ పేరుతో వేధించడంతో బాలుడితో పాటు మరో ఎనిమిది మందిపై పోక్సో కేసు నమోదు చేసి శనివారం రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ స్వాతి తెలిపారు. గ్రామానికి చెందిన బాలికను బాలుడు గత కొన్ని నెలలుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని బాలిక తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement