● సలహాలు సూచనలు పాటిస్తే అధిక లాభాలు
● మధనాపురం కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రాజేందర్‌రెడ్డి
కొత్తకోట రూరల్: జిల్లాలో ఆయిల్ పాం పంట సాగు క్రమేణా పెరుగుతుంది. అయితే పంటలో కొమ్ము పురుగు వ్యాపించే అవకాశం ఉండడంతో మదనాపురం కేవీకే శాస్త్రవేత్త రాజేందర్ రెడ్డి పురుగు నివారణకు పలు సూచనలు చేశారు. కొమ్ము పురుగు (రైనోసిరస్ బీటిల్) 30–50 మి.మీ పొడవుతో ముదురు గోధుమ నుంచి నలుపు రంగులో ఉంటుందని, పురుగు 100–150 వరకు తెలుపు రంగు గుడ్లను 5–10 సెం.మీ లోతులో పశువుల పెండ కుప్పలో లేదా చనిపోయిన చెట్ల మొదళ్లలో సముదాయాలుగా పెరుగుతుందని సూచించారు. ఈ గుడ్లు 2–3 వారాలలో పొదుగుతాయి. పూర్తిగా ఎదిగిన లార్వాలు 30సెం.మీ లోతులో ఉండి కోశస్థ దశలుగా వృద్ది చెంది 3–4 వారాల తర్వాత రెక్కల పురుగు (బీటిల్స్)గా మారుతాయి. తల్లి రెక్ల పురుగులు 200 రోజులు బతికి ఉంటూ సంవత్సరానికి ఒకేసారి జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటాయి. ఈ బీటిల్స్ ఎక్కువగా మొక్క మొదలు దగ్గర అప్పుడే ఏర్పడుతున్న మొవ్వ, ఆకులను ఆశించి నష్టపరుస్తాయి. ఆకుల చివర గ ఆకారపు ఖాళీలు ఏర్పరుస్తాయి. మొవ్వ భాగంలోని ఆకులు కురసగా మెలికలు తిరిగినట్టు అవుతాయి. లేత మొవ్వభాగం ఆశించి లోపలికి చొచ్చుకొపోయి రంధ్రాలు చేసి మొవ్వ కుల్లిపోయేటట్లు చేయడం వల్ల మొక్కలు చనిపోతాయి.
నివారణ...
● తోటల్లో చనిపోయిన చెట్లను తొలగించాలి. ఆయిల్‌పాం తోటలను కలుపు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తోటల్లో పశువుల ఎరువు(పేడ)ను నిల్వ ఉంచకూడదు.
● పశువుల ఎరువు టన్నుకు కిలో కార్పప్యూరాన్ 3 శాతం గుళికలు లేదా 2 కిలోల మలాథియాన్ పొడిని కలుపుకొని మొదలు దగ్గర చల్లాలి.
● మొవ్వలో రంధ్రాలు గుర్తించిన వెంటనే కిలో మట్టికి 30 గ్రాముల మ్యాంకోజోబ్, 100 గ్రాముల క్లోరోఫైరిపాస్ పొడి మందును కలిపి రంధ్రాలు పూడ్చాలి.
● సోలార్ దీపపు ఎరలను ఏర్పాటు చేసుకోవాలి.
● థైనోల్యూర్ కలిగిన లింగాకర్షక బుట్టలు (బకెట్ ఫిర్మోన్ ట్రాప్స్) ఎకరానికి 1–2 ట్రాప్స్ ఏర్పాటు చేసుకోవాలి.
● బీటాల్స్ ఎక్కువగా ఆకర్షించడానికి చెరుకు రసం, ఫైన్ యాపిల్ రసం, ఈస్టును బాగా పులియబెట్టి ఎకరం పొలంలో 5–6 చోట్ల అమర్చుకోవాలి.
● మెటారైజియం అనైసోప్లియా అనే జీవ సంబంధిత శిలీంద్రనాశిని 5గ్రా. లీటరు నీటిలో కలిసి మొవ్వ తడిచేలా పిచికారీ చేసుకుంటే ఫలితం ఉంటుంది.
● పురుగు నివారణకు తొలిదశలో వేప మందు 10,000 పీపీఎం, 1మి.లీ ల్యామ్దా సైహలోత్రిన్, 1మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
● ఉధృతి ఎక్కువగా ఉంటే క్లోరాంట్రిన్ ప్రోల్ 0.3 మి.లీ లేదా స్పైనోశాడ్, 0.3 మి.లీ లేదా ట్రెట్రా టింనిప్రోల్ 1.మి.లీ నీటిలో కలిపి మొక్క సుడిలో పోసుకోవాలి.
● తేట తోటల్లో 10–20 గ్రా 3జీ కార్పోప్యూరాన్ గుళికలు లేదా 10గ్రాముల క్లొరాంట్రిన్‌ఫోల్ గుళి కలు కవర్లలో ఉంచి ఒక చెట్టుకు 4 కవర్లు మొవ్వ భాగంలో కడితే పురుగును నివారించవచ్చు.


