వనపర్తిటౌన్: ప్రధాని మోదీ పాలనలో ప్రపంచ వ్యాప్తంగా భారత్ వికసిస్తుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ప్రపంచ స్థాయిలో భారత దేశానికి గుర్తింపు పెంచిన నాయకుడిగా మోదీ దేశ చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని కొనియాడారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు డి. నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సంక్షేమం, అభివృద్ధి పాలన అందిస్తున్నాడని చెప్పారు. రాష్ట్రంలో 2500 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం డోర్నకల్ టు గద్వాల వయా వనపర్తి 290 కి.మీ దారుల నిర్మాణం ప్రారంభం కాబోతుందని, మహారాష్ట్ర నుండి నిజాంబాద్ మేడ్చల్ మీదుగా డోన్ వరకు 417 కిలోమీటర్లు రూ.4,686 కోట్ల నిధులతో డబ్లింగ్ పనులు 50 శాతం పూర్తయ్యాయని చెప్పారు. ఉపాధి హామీ కూలి రూ.155 నుంచి రూ.307 పెంచాడని, స్వామి నాథన్ కమిషన్ సిఫార్సు మేరకు పెట్టుబడి రూ.100 ఉంటే రూ.150 మద్దతు ధర కల్పించాలన్న నిర్ణయాన్ని మోదీ అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో 54 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులతో 70 ఏళ్ల వరకు ప్రతి వ్యక్తికి రూ.ఐదు లక్షలు 70 ఏళ్లు దాటిన వ్యక్తికి అదనంగా రూ.ఐదు లక్షల బీమా లభిస్తుందని, దేశంలో 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చారని కొనియాడారు. కార్యక్రమంలో మైనార్టీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ అప్సర్ పాషా, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు బి.శ్రీశైలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్. వెంకటేశ్వర్ రెడ్డి, కేతూరి బుడ్డన్న, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనుజ్ఞా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.


