ఇరువురి ఘర్షణలో గొర్లకాపరి హత్య | - | Sakshi
Sakshi News home page

ఇరువురి ఘర్షణలో గొర్లకాపరి హత్య

Jun 14 2026 10:01 AM | Updated on Jun 14 2026 10:01 AM

కర్రతో విచక్షణారాహితంగా దాడి

అనంతరం ఠాణాలో లొంగిపోయిన నిందితుడు

గోపాల్‌పేట: ఇరువురి ఘర్షణలో గొర్లకాపరిని కర్రతో కొట్టిచంపి అనంతరం నిందితుడు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన ఘటన మండల కేంద్రంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల కేంద్రానికి చెందిన మందడి లక్ష్మి వద్ద ఏదుల మండలం మాచుపల్లికి చెందిన బాల్‌చంద్రయ్య(55) గొర్లు మేపేందుకు రూ.2.20లక్షలకు జీతం కుదిరాడు. శుక్రవారంతో సంవత్సరం అయిపోగా.. శుక్రవారం రాత్రి పొద్దున్నే సొంతూరుకు వస్తానని కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి చెప్పాడు. శనివారం ఉదయం 7గంటల ప్రాంతంలో వర్షం కురిసి తగ్గిన తర్వాత గోపాల్‌పేట–చెన్నూరు శివారులో గొర్లు నిలిపిన వద్ద బాల్‌చంద్రయ్యకు గోపాల్‌పేటకు చెందిన పుట్టీల నీలమ్మ కుమారుడు మల్లేష్‌కు గొడవ చోటుచేసుకుంది. గొడవలో భాగంగా బాల్‌చంద్రయ్యపై మల్లేష్‌ కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో బాల్‌చంద్రయ్య అక్కడికక్కడే హత్యకు గురయ్యాడు. అనంతరం మల్లేష్‌ గోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. అనంతరం సీఐ రత్నం, గోపాల్‌పేట ఎస్‌ఐ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్‌టీంను పిలిపించి బాడీని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతుడికి భార్య వరమ్మ, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతదేహాన్ని తరలించేందుకు వీల్లేదని.. తమకు రూ.50లక్షలు నష్టపరిహారం చెల్లిస్తేవరకు కదిలేదిలేదని బాధిత కుటుంబ సభ్యులు భీష్మించుకూర్చున్నారు. శనివారం రాత్రి 7గంటలకు పోలీసులు కల్పించుకొని మృతదేహాన్ని వనపర్తికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement