డీలర్లు వ్యవసాయ సలహాదారులుగా మారాలి | - | Sakshi
Sakshi News home page

డీలర్లు వ్యవసాయ సలహాదారులుగా మారాలి

Jun 13 2026 1:41 PM | Updated on Jun 13 2026 1:41 PM

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): వ్యవసాయ రంగంలో డీలర్ల పాత్ర రోజురోజుకూ పెరుగుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, రైతు శిక్షణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌ బి.వెంకటేష్‌ అన్నారు. వ్యవసాయ ఉత్పాదక డీలర్లను నైపుణ్యవంతమైన పారా ఎక్స్‌టెన్షన్‌ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న డీఏఈఎస్‌ఐ (డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ సర్వీసెస్‌ ఫర్‌ ఇన్‌పుట్‌ డీలర్స్‌) కోర్సును పూర్తి చేసిన 40 మంది డీలర్లకు శుక్రవారం సర్టిఫికెట్లు అందజేశారు. హైదరాబాద్‌లోని మేనేజ్‌ సంస్థ ఆధ్వర్యంలో, మహబూబ్‌నగర్‌ రైతు శిక్షణ కేంద్రం (ఎఫ్‌టీసీ) ద్వారా నిర్వహించిన 2024–25 బ్యాచ్‌ (టీపీ నం 2969) శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఈ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు శాసీ్త్రయ సలహాలు అందించడంలో డీఏఈఎస్‌ఐ శిక్షణ పొందిన డీలర్లు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. వ్యవసాయ సంబంధిత చట్టాలు, పంటల యాజమాన్య పద్ధతులు, ఎరువులు, పురుగు మందుల వినియోగంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ఈ కోర్సు దోహదపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఎరువులు, పురుగుమందుల లైసెన్స్‌లు పొందేందుకు, పునరుద్ధరించుకునేందుకు డీఏఈఎస్‌ఐ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా మారిందని అన్నారు. డీలర్లు రైతులకు కేవలం ఉత్పత్తులు విక్రయించే వ్యాపారులుగా కాకుండా వ్యవసాయ సలహాదారులుగా మారాలని సూచించారు. పంటలలో చీడపీడల నివారణ, సమతుల్య ఎరువుల వినియోగం, నూతన సాంకేతిక పరిజ్ఞానాలపై రైతులకు అవగాహన కల్పించడంలో ముందుండాలని కోరారు. డీఏఈఎస్‌ఐ శిక్షణ ద్వారా పొందిన జ్ఞానాన్ని క్షేత్ర స్థాయిలో రైతుల ప్రయోజనాలకు వినియోగిస్తే వ్యవసాయ ఉత్పాదకత పెరగడంతో పాటు రైతుల ఆదాయం కూడా మెరుగుపడుతుందని అన్నారు. కార్యక్రమంలో ఏడీఎ మాధవి, ఏడీఎ (ఆర్‌) రాంపాల్‌, ఏఓలు మీనా, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement