అతివేగానికి నిండుప్రాణం బలి | - | Sakshi
Sakshi News home page

అతివేగానికి నిండుప్రాణం బలి

Jun 13 2026 1:41 PM | Updated on Jun 13 2026 1:41 PM

ఆటోను ఢీకొన్న కారు.. డ్రైవర్‌ మృతి

రామస్వామి మృతికి పోలీసుల దిగ్భ్రాంతి

కొత్తకోట రూరల్‌: ముందు వెళ్తున్న ఆటోను అతివేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొనడంతో ఆటో డ్రైవర్‌ దుర్మరణం చెందిన ఘటన మండలంలోని అమడబాకుల సమీపంలోని జాతీయ రహదారి–44పై శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. కొత్తకోట ఎస్‌ఐ శివానందంగౌడ్‌ కథనం ప్రకారం.. అమడబాకులకు చెందిన రామస్వామి(55) సొంత ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజువారీ పనిలో భాగంగా గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆటోలో తీసుకెళ్లి దించిన అనంతరం సమీపంలోని ఓ దాబాలో భోజనం చేసి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి కర్నూలు వైపు అతివేగంగా వచ్చిన కారు ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొడుతూ రోడ్డు కింద బోల్తాపడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఘటనా.. స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినప్పటికీ తీవ్రగాయాలు కావడంతో అప్పటికే రామస్వామి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వనపర్తి మార్చురీకి తరలించారు. మృతుడి కుమారుడు నవీన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా, కొత్తకోట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రోడ్డు ప్రమాదాలు, ప్రమాదవశాత్తు మరణాలు సంభవించినప్పుడు తరచుగా పోలీసులకు సేవలందించేది రామస్వామి ఆటోనే కావడం గమనార్హం. ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసే రామస్వామి ప్రమాదంలో మృతి చెందడంతో పోలీసులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామస్వామి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement