పాలమూరు రైతుకు ‘అభ్యుదయ’ పురస్కారం | - | Sakshi
Sakshi News home page

పాలమూరు రైతుకు ‘అభ్యుదయ’ పురస్కారం

Jun 13 2026 1:41 PM | Updated on Jun 13 2026 1:41 PM

మహబూబ్‌నగర్‌(వ్యవసాయం): వ్యవసాయ రంగంలో వినూత్న పద్ధతులు అనుసరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న పాలమూరు రైతుకు అరుదైన గౌరవం దక్కింది. మహబూబ్‌నగర్‌ మండలం కోటకదిర గ్రామానికి చెందిన రైతు జ్ఞానేశ్వర్‌రెడ్డికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక ’అభ్యుదయ రైతు పురస్కారం ప్రదానం చేసింది. విశ్వవిద్యాలయం 62వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా జ్ఞానేశ్వర్‌రెడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వ్యవసాయ రంగంలో ఆయన చేస్తున్న విశేష కృషి, ముఖ్యంగా సేంద్రియ సాగులో అనుసరిస్తున్న ప్రయోగాత్మక విధానాలను గుర్తించి విశ్వవిద్యాలయం ఈ అవార్డుకు ఎంపిక చేసింది. జ్ఞానేశ్వర్‌రెడ్డి రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గిస్తూ సహజ సిద్ధ పద్ధతుల్లో సాగు చేస్తున్నాడు. తక్కువ వ్యయంతో అధిక నాణ్యత గల పంటలను పండిస్తూ ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో ఆయన చేస్తున్న కృషి విశేషమని విశ్వవిద్యాలయ అధికారులు పేర్కొన్నారు. పాలమూరు జిల్లాకు చెందిన రైతు రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకోవడంపై రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని రైతులకు ఇది మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement