● ఈ నెల 28న పల్స్ పోలియోకుసిద్ధం కావాలి
● డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాసులు
పాలమూరు: రాబోయో వర్షకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు మలేరియా, డెండీ, చికెన్‌గున్యా, అతిసార వ్యాధుల కట్టడి కోసం నివారణ ప్రణాళికలతో మెడికల్ ఆఫీసర్లు సిద్ధంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం జాతీయ ఆరోగ్య కార్యక్రమాలతో పాటు సీజన్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. సబ్ సెంటర్లతో పాటు పీహెచ్‌సీల నుంచి ప్రత్యేక కార్యాచరణ ఉండాలన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, సురక్షితమైన తాగునీరు మొదలైన వాటిపై అవగాహన పెంచాలన్నారు. క్షేత్రస్థాయిలో గర్భిణీలను త్వరగా గుర్తించి రిజిస్ట్రేషన్ చేసుకొని వారికి కావాల్సిన పరీక్షలు, అనిమియా నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. సురక్షిత కాన్పు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయ్యేటట్లు ప్రణాళిక చేసి దానిని అమలు చేయాలన్నారు. కుష్టు, క్షయ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే సులుభంగా వ్యాధి చికిత్సలతో నివారించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ శైలజ, రాజు, శివకాంత్, డీపీఓ సీతరామ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


