జైల్లో ఖైదీలు సత్ప్రవర్తనతో ఉండాలి | - | Sakshi
Sakshi News home page

జైల్లో ఖైదీలు సత్ప్రవర్తనతో ఉండాలి

Jun 13 2026 1:11 PM | Updated on Jun 13 2026 1:11 PM

పాలమూరు: జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్ని రకాల ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.ప్రేమలత అన్నారు. నగరంలోని జిల్లా జైలును శుక్రవారం న్యాయమూర్తి సందర్శించించారు. మొదట ఖైదీలు ఉండే అన్నిరకాల బ్యారక్‌లను పరిశీలించి శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలు, అండర్‌ ట్రయల్‌ ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదులను నియమించుకోలేని ఖైదీలు సమాచారం ఇస్తే న్యాయసేవ అధికార సంస్థ ద్వారా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు. కేసులు నమోదై జైలుకు వచ్చిన పలువురు యువతతో ప్రత్యేకంగా మాట్లాడి కే సుకు దారి తీసిన వివరాలపై అడిగి తెలుసుకు న్నారు. అనంతరం కిచెన్‌ సందర్శించి భోజనం నాణ్యతను పరిశీలించారు. లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ పనితీరును జైలు అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట న్యాయమూర్తి ఇందిర, జైలు సూపరింటెండెంట్‌ శశికాంత్‌ ఉన్నారు.

అటెండర్లకు పోస్టింగ్‌

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): జిల్లాలో ఆరుగురు అటెండర్లకు పోస్టింగ్‌ ఇస్తున్నట్లు శుక్రవారం కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 317 జీఓ ప్రకారం ఇతర జిల్లాల్లో పని చేస్తున్న వీరికి జిల్లాను కేటాయించడంతో పాటు మండలాలను కేటాయించారు. వనపర్తి నలుగురు, నాగర్‌కర్నూల్‌ నుంచి ఇద్దరు జిల్లాకు వచ్చారు. శ్రీకాంత్‌ను కోయిల్‌కొండ తహసీల్దార్‌ కార్యాలయం, లక్ష్మీనారాయణకు నవాబ్‌పేటతహసీల్దార్‌ కార్యాలయం, కల్పనకు అడ్డాకుల తహసీల్దార్‌ కార్యాలయం, నర్సింహులును డీసీఎస్‌ఓ కార్యాలయం, ఇలియాస్‌, అబ్దుల్‌ ఖాదర్‌కు కలెక్టరేట్‌ అటెండర్లుగా పోస్టింగ్‌ ఇచ్చారు.

ఇజ్రాయిల్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ఇజ్రాయిల్‌ దేశంలో సంరక్షకుడు ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారి మైత్రిప్రియ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా ఎంప్లాయిమెంట్‌ శాఖ కార్యాలయంలో కానీ, 94400 52081, 94400 51763 నంబర్లకు సంప్రదించాలన్నారు.

బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ ఆర్‌ఎం జగన్‌

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: టీజీఆర్‌టీసీ మహబూబ్‌నగర్‌ డిప్యూటీ ఆర్‌ఎం (మెయింటెనెన్స్‌) గా జగన్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇటీవల హైదరాబాద్‌లోని వర్క్‌షాపు నుంచి ఇక్కడికి బదిలీ అయిన విష యం విదితమే. అనంతరం ఆర్‌ఎం సంతోష్‌కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.

ధాన్యం @ రూ.2,926

జడ్చర్ల: బాదేపల్లిలో శుక్రవారం ఆర్‌ఎన్‌ఆర్‌ క్వింటా గరిష్టంగా రూ.2,926, కనిష్టంగా రూ. 1,741 ధరలు లభించాయి. మొక్కజొన్న క్వింటా గరిష్టంగా రూ.2,051, వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.6,956, కనిష్టంగా రూ.4,611, పొద్దుతిరుగుడు గరిష్టంగా రూ.6,950, కనిష్టంగా రూ.6,640 ధరలు పలికాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement