12 ఏళ్ల పాలనలో దేశ అభివృద్ధిలో కొత్త పుంతలు | - | Sakshi
Sakshi News home page

12 ఏళ్ల పాలనలో దేశ అభివృద్ధిలో కొత్త పుంతలు

Jun 13 2026 1:11 PM | Updated on Jun 13 2026 1:11 PM

ఎంపీ డీకే అరుణ

పాలమూరు: ఈనెల 10వ తేదీ నాటికి దేశానికి అత్యధిక కాలం 4,399 రోజుల పాటు ప్రధానిగా సేవలు అందించిన వ్యక్తిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారని ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన మోదీపై ఉన్న విశ్వాసంతో కాషాయ జెండాను ప్రజలు ఎగురవేస్తున్నారన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా భావించి పరిపాలన అందిస్తున్నట్లు వెల్లడించారు. మోదీ 12 ఏళ్ల పాలనలో దేశం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కిందన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్ముకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు కల్పించారని, 11 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్‌ ఇచ్చినట్లు చెప్పారు. జనధన్‌ యోజన కింద 58 కోట్ల మందికి జీరో ఖాతాలు తెరవడంతో పాటు చిరు వ్యాపారులకు రూ.57 వేల కోట్ల రుణాలు, వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి కింద రుణాలిచ్చినట్లు గుర్తు చేశారు. పీఎం కిసాన్‌ కింద ఏడాదికి రూ.6 వేల నగదు, ఎరువులపై 90 శాతం సబ్సిడీని మోదీ ప్రభుత్వం అందిస్తోందని వివరించారు. జిల్లాలో గుడెబల్లూర్‌ నుంచి మహబూబ్‌నగర్‌కు నాలుగు లైన్ల రోడ్లు మంజూర, ఇతర జాతీయ రహదారులు, రింగ్‌రోడ్డు, బైపాస్‌ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి, పద్మజారెడ్డి, అంజయ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement