● వేలంలో మెరిసిన నలుగురు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు
● ఆల్‌రౌండర్ గణేష్‌కు రూ.3.25 లక్షలకు
దక్కించుకున్న హైదరాబాద్ చాంపియన్స్
● పాలమూరు స్ట్రైకర్‌కు షాదాబ్ అహ్మద్,
హైదరాబాద్‌కు జశ్వంత్, రంగారెడ్డికి అరుణ్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఉప్పల్ స్టేడియం వేదికగా ఈనెల 21 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు కొనసాగనున్న టీజీ టీ–20 క్రికెట్ లీగ్‌కు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నలుగురు క్రికెటర్లు ఎంపికయ్యారు. ఇటీవలే దీనికి సంబంధించి నిర్వహించిన క్రీడాకారుల వేలం పాటలో పాలమూరు నగరానికి చెందిన ఆల్ రౌండర్ జి.గణేష్ రూ.3.25 లక్షలకు హైదరాబాద్ చాంపియన్స్ జట్టులో చోటు దక్కించుకున్నారు. గణేష్.. కొన్నేళ్లుగా హెచ్‌సీఏ లీగ్ మ్యాచ్‌లలో విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. టూడే, త్రీ డే లీగ్‌లలో సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సంచరీలు చేశారు. అలాగే మహబూబ్‌నగర్‌కే చెందిన ఎడమచేతి బ్యాట్స్‌మన్ షాదాబ్‌అహ్మద్ రూ.75 వేలకు పాలమూరు స్ట్రైకర్ జట్టుకు ఎంపికయ్యారు. ఇటీవల హెచ్‌సీఏ టీ–20 లీగ్‌లో జిల్లా జట్టు తరఫున షాదాబ్ సెంచరీ చేయడం విశేషం. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరుకు చెందిన బౌలర్ జి.జస్వంత్ ఈ వేలంలో హైదరాబాద్ చాంపియన్స్ జట్టు రూ.75 వేలకు దక్కించుకుంది. ఇతడి ప్రతిభను గుర్తించిన ఎండీసీఏ (మహబూబ్‌నగర్ క్రికెట్ అసోసియేషన్) ఆధ్వర్యంలో గత ఏడాది నుంచి ఉచిత శిక్షణ ఇప్తిస్తున్నారు. అలాగే చదువుకయ్యే ఖర్చును సైతం ఎండీసీఏ కొంతవరకు భరిస్తోంది. దీంతో అనతి కాలంలోనే మెరుగైన బౌలర్‌గా ఎదిగారు. గద్వాల పట్టణానికి చెందిన ఆల్ రౌండర్ అరుణ్‌కుమార్ రూ.లక్షకు రంగారెడ్డి రైజర్స్ జట్టులో చోటు దక్కించుకున్నారు. అనంతరం ఈ నలుగురు క్రీడాకారులను ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అభినందించారు. నాగర్‌కర్నూల్, గద్వాల వంటి ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఈ లీగ్ అవకాశం దక్కడం.. వేలాది గ్రామీణ ప్రాంత యువకులకు సరికొత్త నమ్మకాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. లీగ్‌లో అద్భుతంగా రాణించి ఐపీఎల్‌తో పాటు జాతీయ జట్టు రేసులోకి దూసుకెళ్లాలని ఆకాంక్షించారు.


