● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మాణం
● వాల్యూఫర్ మనీ కింద ప్రజల భాగస్వామ్యం
జడ్చర్ల టౌన్: జడ్చర్ల మున్సిపాలిటీలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా రూ.15కోట్లతో అండర్ డ్రెయిన్ నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోపాటు స్థానికంగా వనరుల సమీకరణ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయాలని మున్సిపాలిటీ అధికారులు భావిస్తున్నారు. అయితే పథకం ద్వారా వాల్యూఫర్ మనీ కింద ప్రజలను భాగస్వాములు చేసి ప్రతినెలా తక్కువ మొత్తంలో వసూలు చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వివిధ పథకాల్లో అభివృద్ధికి నోచుకుంటున్న మున్సిపాలిటీలు, కా ర్పోరేషన్లను మరింత సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ.. అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌ను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా కేంద్రం 50శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25శాతం నిధులు కేటాయిస్తాయి. మిగిలిన 25శాతం నిధులను మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్థానికంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా వాల్యూఫర్ మనీని ఆశిస్తున్నారు. పెట్టిన ఖర్చులకు కొంతైనా రాబడి రావాలన్న ఉద్దేశం ఉంది.
రూ.15కోట్లతో ప్రతిపాదనలు
అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ.15కోట్లతో అండర్ డ్రెయిన్ నిర్మాణం కోసం జడ్చర్ల మున్సిపాలిటీ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో అంతా ఓపెన్ డ్రెయిన్ ఉండటం దీనికి ఆటంకంగా మారింది. రూ.15కోట్లతో మున్సిపాలిటీ అంతా అండర్ డ్రెయిన్ నిర్మించడం సాధ్యం కాదు. ఈ కారణంగా కొత్తగా వెలుస్తున్న కాలనీల్లో అండర్ డ్రెయిన్ నిర్మాణం చేయా లని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రతిపాదనలు సిద్ధం అయ్యాక అండర్ డ్రెయిన్ నిర్మాణాలు జరిగితే సంబంధిత కాలనీలో ప్రతిఇంటి నుంచి నామమాత్రంగా కొంత వసూలు చేయా లని భావిస్తున్నారు. వాల్యూ ఫర్ మనీగా కేంద్రం ఆశిస్తుండటంతో తప్పనిసరి చేయాల్సి వస్తుంది.


