అధికారులు సమన్వయంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

Jun 13 2026 1:11 PM | Updated on Jun 13 2026 1:11 PM

మన్ననూర్‌: చెంచు, గిరిజనుల అభివృద్ధి కోసం జిల్లాలోని అన్నిశాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ ఆదేశించారు. శుక్రవారం మన్ననూర్‌లోని ఐటీడీఏ కార్యాలయం సమావేశం హాల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యంత వెనుకబాటు తనంలో ఉన్న చెంచు, గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. విద్య, వైద్యం, పౌష్టికాహారం, తాగునీరు, ఉపాధి అవకాశాలు పూర్తిస్థాయిలో నేరుగా చెంచులకే అందించేవిధంగా క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా చెంచుపెంటల్లోని బడీడు, డ్రాప్‌ ఆవుట్స్‌ పిల్లలను బడిలో చేర్పించే విధంగా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలన్నారు. ఆశ్రమ, గిరిజన సంక్షేమ, జీవీవీకే పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచడంతోపాటు చెంచు, గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులను అభ్యశించే విధంగా ప్రోత్సహించాలన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన వైద్యం, టీకాలు, పౌష్టికాహారం క్రమం తప్పకుండా అందుబాటులో ఉంచాలన్నారు. చెంచుపెంటల్లో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ఐటీడీఏ, అనుబంధ శాఖల సహకారంతో చెంచు యువతకు ఉపాధి కల్పన, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అలాగే చెంచుల జీవనోపాధులు మెరుగుపడేందుకు లైవ్లీహుడ్‌, సౌర గిరిజల పథకం, అందరికి ఆధార్‌ అప్‌డేట్‌, ఆధార్‌కు మొబైల్‌ అనుసంధానం వంటి కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. ముఖ్యంగా మొబైల్‌ నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న అటవీ లోతట్టు ప్రాంత చెంచుపెంటలను గుర్తించి అక్కడే ఆధార్‌ అప్‌డేట్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆధార్‌, రేషన్‌ కార్డులు అందించే ఏర్పాటు చేయాలన్నారు. చెంచుపెంటలు, గ్రామాలు, గూడాల్లో ఇప్పటికే చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ రేవంత్‌ చంద్ర, ఇన్‌చార్జి డీటీడీఓ ఉమాపతి, డీఆర్డీఏ పీడీ చిన్నఓబులేష్‌, మిషన్‌ భగీరథ డీఈ హేమలత, ఐటీడీఏ ప్రాజెక్టు మేనేజర్‌ జాఫర్‌ హుస్సేన్‌, ఎంపీడీఓ లింగయ్య, ఏపీఓ యాదమ్మ, సీడీపీఓ దమయంతి, వివిధ శాఖల జిల్లా, మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement