సీజన్‌కు అవసరమైన యూరియా సిద్ధం | - | Sakshi
Sakshi News home page

సీజన్‌కు అవసరమైన యూరియా సిద్ధం

Jun 12 2026 5:57 AM | Updated on Jun 12 2026 5:57 AM

‘యూరియా యాప్‌’ను ప్రారంభించినఅదనపు కలెక్టర్‌

జిల్లాలో 8,513 మెట్రిక్‌ టన్నుల బఫర్‌ స్టాక్‌: డీఏఓ

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): వానాకాలం–2026 సీజన్‌కు సంబంధించి రైతులు యూరియా ను సులభంగా పొందేందుకు రూపొందించిన ‘యూరియా యాప్‌’ను రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జేఎల్‌బీ హరిప్రియ ప్రారంభించారు. గురువారం కలెక్టరేట్‌లోని జిల్లా వ్యవసాయ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో రైతులు యూరియా కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చేదని, ప్రస్తుతం యాప్‌ ద్వారా ముందస్తుగా బుకింగ్‌ చేసుకుని అవసరమైన ఎరువును పొందే అవకాశం కల్పించామని తెలిపారు. జిల్లాలోని 17 మండలాల్లో ఉన్న 250 అధీకృత ఎరువుల విక్రయ కేంద్రాల్లో ఎక్కడైనా యూరియాను బుక్‌ చేసుకుని కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వానాకాలం సీజన్‌కు అవసరమైన మేరకు యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, రైతులు కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి బి.వెంకటేష్‌ మాట్లాడుతూ ప్రస్తుతం 14,759 యూరియా బ్యాగులు (664 మెట్రిక్‌ టన్నులు) యాప్‌ ద్వారా బుకింగ్‌ కోసం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అదనంగా మార్క్‌ఫెడ్‌లో 5,868 మెట్రిక్‌ టన్నులు, కంపెనీ గోదాముల్లో 2,339 మెట్రిక్‌ టన్నులు, హోల్‌సేల్‌ డీలర్ల వద్ద 306 మెట్రిక్‌ టన్నులు నిల్వ ఉన్నాయని చెప్పారు. మొత్తం 8,513 మెట్రిక్‌ టన్నుల బఫర్‌ స్టాక్‌ జిల్లాలో అందుబాటులో ఉందన్నారు. కౌలు రైతులు, ఆర్‌ఎఎఫ్‌ఆర్‌ రైతులు కూడా ఈ యాప్‌ ద్వారా యూరియాను పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే పారదర్శకంగా ఎరువుల పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏడీఏ బి.మాధవి, వ్యవసాయ అధికారి ఎంఎ బాసిత్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement