● 12 తులాల బంగారం, 60 తులాల వెండి, రూ.6వేల నగదు అపహరణ
● గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
గద్వాల క్రైం: పట్టణంలో భారీ ఎత్తున దొంగతనం జరిగిన ఘటన బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. గద్వాల పట్టణంలోని భీంనగర్ కాలనీలో నివాసం ఉటుంన్న రహిమ్మత్‌పాష వృత్తిరీత్యా ట్రావెల్స్ (కారు అద్దె)కు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఉదయం వ్యక్తిగత పనులపై ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లాడు. అయితే గుర్తుతెలియని దుండగులు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలో భద్రపరచిన 12 తులాల బంగారు ఆభరణాలు, 60 తులాల వెండి, రూ.6వేల నగదును అపహరించారు. పనులు ముగించుకుని ఇంటికి వచ్చి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్, క్రైం విభాగం, క్లూస్, ఫింగర్ ప్రింట్ సిబ్బంది చోరీ జరిగిన ఇంటికి చేరుకుని వివరాలు సేకరించారు. కాలనీలో సీసీ కెమెరాల ఫుటేజీలను సాంకేతిక విభాగ సిబ్బంది పరిశీలించారు. చుట్టూ పరిసర ప్రాంతాల్లోని కాలనీవాసులతో మాట్లాడి కొత్త వ్యక్తుల కదలికలపై ఆరా తీశారు.
స్థానికుల్లో ఆందోళన
జిల్లా కేంద్రంలో నిత్యం పోలీసు నిఘా, పెట్రోలింగ్ గస్తీ నిర్వహిస్తున్నప్పటికీ చోరీ జరగడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. కొన్ని నెలలుగా జిల్లా కేంద్రంలో ఇంత పెద్ద ఎత్తున చోరీ జరగడం ఇదే అని స్థానికులు చెబుతున్నారు. చోరీ ఘటనపై పోలీసులు పలు బృందాలుగా విడిపోయి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చోరీ తీరును బట్టి చూస్తే అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు చేసి ఉంటారనే అనుమానం వ్యక్తమవుతుంది. ఘటనపై బాధితుడు రహిమ్మత్‌పాష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్ తెలిపారు. త్వరలో నిందితులను గుర్తించి బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు.


